మన అథ్లెట్లు బజరంగ్ పూనియా, ఎలవెనిన్ వలారివన్లకు అరుదైన అవార్డు లభించింది. 2019-20 ఏడాదికిగానూ తమతమ రంగాల్లో ఉన్నతంగా రాణించిన కారణంగా, క్రీడా పురస్కారం 'ఎఫ్ఐసీసీఐ'కి ఎంపికయ్యారు. కరోనా ప్రభావమున్న నేపథ్యంలో వర్చువల్‌గా వీటిని ప్రదానం చేశారు.
రెజ్లర్ బజరంగ్ పూనియా.. ప్రస్తుతం అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ పురస్కారానికి తామిద్దరూ ఎంపికవ్వడంపై బజరంగ్, ఎలవెనిన్ ఆనందం వ్యక్తం చేశారు.
"భవిష్యత్‌లో ఉత్తమంగా రాణిస్తూ, దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావడమే లక్ష్యం. మా ప్రతిభకు ఇలాంటి గుర్తింపు లభించినప్పుడు అది మరింత ప్రేరణగా నిలుస్తుంది. ఈ సందర్భంగా ఇతర పురస్కారాల విజేతలకూ నా అభినందనలు"
- బజరంగ్ పూనియా, రెజ్లర్
"నా కెరీర్లో వెన్నంటే ఉన్న నా కుటుంబ సభ్యులకు, మార్గనిర్దేశకుడు గగన్ నారంగ్‌తో పాటు కోచ్ నేహా చౌహాన్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) కష్టసమయాల్లోనూ నాకెంతో మద్దతుగా నిలిచింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆటకు కావాల్సిన సామాగ్రినంతా సమకూర్చింది"
- ఎలవెనిన్ వలారివన్, షూటర్
ఎఫ్ఐసీసీఐ పరిశ్రమ సంస్థ.. వివిధ క్రీడారంగంలో ఉన్నత ప్రతిభ చూపిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తుంది. దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు 'ఉత్తమ క్రీడా ప్రోత్సాహక సంస్థ' పురస్కారం దక్కింది. టెన్విక్ స్పోర్ట్స్ ప్రైవేట్ సంస్థలో భాగంగా ఈ అవార్డును అందుకున్నారు.