Bajrang Punia Allegations On NADA :ప్రముఖ భారత రెజ్లర్, ఒలింపిక్ వీరుడు భజరంగ్ పూనియా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ- ఎన్ఏడీఏపై సంచలన ఆరోపణలు చేశాడు. కాలం చెల్లిన పరికరాలతో ఆ ఏజెన్సీ డోపింగ్ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపించాడు. తనకు డోపింగ్ టెస్ట్ చేయడానికి వచ్చిన ఎన్ఏడీఏ బృందం కాలం చెల్లిన పరికరాలను ఉపయోగించిందన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో డోపింగ్ పరికరాల ఫొటోలను చూపించాడు. అంతేకాకుండా ఈ డోపింగ్ ఏజెన్సీతో జాగ్రతా ఉండాలంటూ యువ రెజ్లర్లను హెచ్చరించాడు.
"ఇది మనందరం చూడవలసిన, పరిగణలోకి తీసుకోవాల్సిన చాలా ముఖ్యమైన వీడియో. సరైన విధానాలను అనుసరించని వ్యవస్థను మేము ఎలా విశ్వసిస్తాము? మొత్తం ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎవరైనా ఎలా నిర్ధరిస్తారు? ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురుకావచ్చు. ముఖ్యంగా జూనియర్ అథ్లెట్లకు సంభవించవచ్చు. దయచేసి డోపింగ్‌కు సంబంధించిన మీ హక్కులు, ప్రక్రియ గురించి తెలుసుకోండి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. అథ్లెట్లు ఇలాంటి డోపింగ్ టెస్ట్‌ల సమయంలో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను"
-- భజరంగ్ పూనియా, భారత రెజ్లర్
తాను ఎన్ఏడీఏకు చెందిన ఏ అధికారినీ టార్గెట్ చేయలేదని భజరంగ్ అన్నాడు. అదేసమయంలో ఇతరుల కోసం వారు ఎలా పనిచేశారో ఈ చర్య బహిర్గతం చేసిందని అధికారులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. 'నేను మీ తప్పును ఎత్తి చూపడం లేదు. మీ ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా అథ్లెట్లను డోప్ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. నాతో పాటు వినేశ్ ఫోగట్, సాక్షి వంటి ఇతర అగ్రశ్రేణి భారత రెజ్లర్లపై డోపింగ్ పరీక్షల వెనుక బ్రిజ్ భూషణ్ హస్తం ఉంది. బ్రిజ్ భూషణ్ డోపింగ్ వలలో ఓ అమ్మాయి చిక్కుకుంది. ఆమె పేరు నేను చెప్పదలచుకోలేదు. వాళ్లు కొంత మందికి డబ్బు ఆశ చూపారు. మరికొంత మందిని బెదిరించారు. ఇప్పుడు డోపింగ్ కేసుల్లో ఇరికిస్తున్నారు.' అని భజరంగ్ పూనియా వీడియోలో ఆరోపించాడు.