తెలంగాణ

telangana

వినేశ్ ఫొగాట్​, బజరంగ్​ పునియాకు ట్రయల్స్ నుంచి మినహాయింపు.. ఎందుకో తెలుసా?

By

Published : Jul 18, 2023, 9:54 PM IST

Asian Games Trials Wrestling : భారత అగ్రశ్రేణి రెజ్లర్లు వినేశ్ ఫొగాట్​, బజరంగ్ పునియా సెలక్షన్ ట్రయల్స్​లో పాల్గొనకుండానే నేరుగా ఆసియా కప్​లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

asian games vinesh phogat
asian games vinesh phogat

Asian Games Trials Wrestling : భారత స్టార్​ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్​, బజరంగ్ పునియా సెలక్షన్​ ట్రయల్స్​లో పాల్గొనకుండానే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించింది. చైనాలోని హాంగ్జౌలో ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి వీరిద్దరూ నేరుగా వెళ్లనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం అడ్​హక్ కమిటీ తెలిపింది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ టాప్ అథ్లెట్ కానందున ఆమెకు మినహాయింపు లభించలేదు. అందువల్ల ఆమె ట్రయల్స్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రాథమిక ట్రయల్స్‌ నిర్వహించడం ద్వారా ఐఓఏ.. గడువు లోపు ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ)కు రెజ్లర్ల పేర్లను పంపుతుంది.

మరోవైపు భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు జాతీయ యాంటీ-డోపింగ్‌ ఏజెన్సీ ఇటీవలె నోటీసులు జారీ చేసింది. డోపింగ్‌ నిరోధక నిబంధనలను పాటించనందుకు గానూ ఆమెకు ఈ నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. దీనిపై స్పందించేందుకు ఏజెన్సీ ఆమెకు రెండు వారాల గడువు ఇచ్చింది.

'డోపింగ్‌ నిరోధక నియమాలను పాటించడంలో మీరు (వినేశ్‌) విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. మా రిజిస్టర్డ్‌ టెస్టింగ్‌ పూల్‌లో మీ పేరును చేర్చినట్లు 2022 మార్చి, 2022 డిసెంబరులో మీకు ఈ-మెయిల్‌ చేశాం. దీంతో, యాంటీ డోపింగ్‌ నిబంధనల కింద ప్రతి త్రైమాసికానికి ముందు మీరు ఎక్కడున్నారన్న విషయాన్ని ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. ఆ త్రైమాసికంలో మీరు ఏ రోజు ఎక్కడుంటారన్న స్పష్టమైన సమాచారాన్ని కూడా ఇవ్వాలి. మీరు చెప్పిన ప్రదేశంలో చెప్పిన సమయానికి డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండాలి' జాతీయ యాంటీ-డోపింగ్‌ ఏజెన్సీ(NADA) నోటీసుల్లో పేర్కొంది.

Wrestlers Protest : WFI చీఫ్ బ్రిజ్‌భూషణ్‌ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌ సహా పలువురు మహిళా రెజ్లర్లు జనవరిలో దిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు చేపట్టారు. దిల్లీ పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించడంలేదని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో దిల్లీ పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక వేధింపులతోపాటు, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత లైంగిక ఆరోపణలు చేసిన మైనర్‌ బాలిక ఫిర్యాదును ఉపసంహరించుకోవడం వల్ల పొక్సో కేసును తొలగించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

...view details