తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asian Games 2023 : అతి పెద్ద క్రీడా పండగ వచ్చేసింది.. మనోళ్లు పతకాల సెంచరీని అందుకుంటారా?

Asian Games 2023 : ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు సమయం ఆసన్నమైంది. చైనా వేదికగా శనివారం ఓ గ్రాండ్​ ఈవెంట్​తో ఈ పోటీలు ఆరంభం కానున్నాయి. దీంతో రానున్న కొద్ది రోజుల పాటు ఆ ప్రాంతమంతా అథ్లెట్లతో సందడిగా మారనుంది. ఈ క్రమంలో ఆసియా క్రీడల గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..

Asian Games 2023
Asian Games 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 10:26 AM IST

Asian Games 2023 : ఒలింపిక్స్‌ తర్వాత అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది ఆసియా క్రీడలు. ఆసియా దేశాల మధ్య ఆటల్లో ఆధిపత్యం కోసం సాగే ఈ సమరంలో పతకాల వేటలో సాగేందుకు అథ్లెట్లు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే వివిధ క్రీడల్లో పోటీలు ప్రారంభమవ్వగా.. శనివారం అధికారికంగా ఈ క్రీడలు ఆరంభమవుతాయి. కొవిడ్​ తర్వాత జరుగుతున్న ఈ క్రీడా ఈవెంట్‌లో మెడల్స్​ను ముద్దాడేందుకు నీరజ్‌ చోప్రా సారథ్యంలోని భారత అథ్లెట్ల బృందం సిద్ధమైంది. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తులు ఊరిస్తున్న నేపథ్యంలో ఈ క్రీడలు మరింత ప్రత్యేకంగా మారాయి. ఇక ఇప్పటి నుంచి అక్టోబర్‌ 8 వరకు ఆటలే ఆటలుగా సాగనుంది.

ఇప్పటికే వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, క్రికెట్‌, రోయింగ్‌, సెయిలింగ్‌, పెంటథ్లాన్‌ లాంటి పోటీలు ప్రారంభమవ్వగా.. శనివారం జరగనున్న ఓపెనింగ్​ కార్యక్రమంతో క్రీడల సందడి మరో స్థాయికి చేరనుంది. ఈ క్రమంలో ఈ నెల 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు ఆ వేదికలో అథ్లెట్ల హోరా హోరీగా పోటీపడనున్నారు. 2022లోనే జరగాల్సిన ఈ పోటీలు చైనాలో వ్యాప్తిస్తున్న కొవిడ్​ కారణంగా ఓ ఏడాది వాయిదా వేశారు.

2018లో సుమారు 70 పతకాలను తన ఖాతాలోకి వేసుకున్న భారత్‌.. ఈ సారి వంద పతకాలు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. అయితే 1986 నుంచి భారత్‌ టాప్‌-5లో నిలవలేదు. కానీ ఈ సారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో.. 39 క్రీడల్లో 655 మంది అథ్లెట్లు పతకాల వేటకు సై అంటున్నారు. శనివారం సాయంత్రం 5.30కు మొదలయ్యే ఈ ఆరంభ వేడుకల్లో లవ్లీనా, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ కెప్టెన్‌) భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

ఆశలన్నీ వారిపైనే..
ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచేందుకు సిద్ధమైన భారత్‌.. తమ వద్దనున్న అథ్లెట్స్​పైనే భారీ ఆశలు పెట్టుకుంది. 2018లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు 8 స్వర్ణాలు సహా 20 పతకాలు గెలిచారు. దీంతో ఈ సారి కనీసం 25 పతకాలు తమ ఖాతాలోకి వస్తాయన్న అంచనాలున్నాయి. ఇక స్టార్​ జావెలిన్​ త్రో ప్లేయర్​ నీరజ్‌ చోప్రా.. 2018లో గెలిచిన పసిడిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. జ్యోతి యర్రాజి (100మీ.హార్డిల్స్‌, 200మీ.పరుగు), నందిని (హెప్టథ్లాన్‌), తేజస్విన్‌ శంకర్‌ (డెకథ్లాన్‌), మురళీ శ్రీశంకర్‌, శైలి సింగ్‌ (లాంగ్‌జంప్‌), అవినాశ్‌ సాబ్లె, పారుల్‌ చౌదరి (3000మీ. స్టీపుల్‌ఛేజ్‌), తజిందర్‌పాల్‌ (షాట్‌పుట్‌), ప్రవీణ్‌ చిత్రవేల్‌ (ట్రిపుల్‌ జంప్‌)తో పాటు రిలే జట్లూ పతకాలు గెలిచే అవకాశాలున్నాయి.

మరోవైపు కబడ్డీ, హాకీ, క్రికెట్‌లో పురుషుల, మహిళల స్వర్ణాలు భారత్‌ ఖాతాలోనే చేరే ఆస్కారం కనిపిస్తోంది. గత క్రీడల్లో రెండు స్వర్ణాలు సహా 9 పతకాలు గెలిచిన షూటర్లు.. అదే జోరు కొనసాగించాలని ఆశిస్తున్నారు. షట్లర్లు, ఆర్చర్లు, బాక్సర్లు, రెజ్లర్లు కూడా ఈ బంగారు పతకాలపై కన్నేశారు.

తొలిసారిగా..
ఆసియా క్రీడల్లో తొలిసారిగా ఈ- స్పోర్ట్స్‌, బ్రేక్‌ డ్యాన్సింగ్‌ను చేర్చారు. 2018లో ఈ- స్పోర్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించగా.. వాటిని ఈ సారి అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2010, 2014 తర్వాత మళ్లీ ఈ ఏడాదికిగాను క్రికెట్‌ను చేర్చారు. 2018 విరామం తర్వాత చెస్‌, గో, జియాంగ్‌క్వీ తిరిగొచ్చాయి.

Asian Games 2023 Volleyball : ఆసియా క్రీడల వాలీబాల్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్స్​లోకి అడుగుపెట్టింది. శుక్రవారం భారత్‌ 3-0 (25-22, 25-22, 25-21)తో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో సౌత్​ కొరియాను ఓడించిన భారత్‌.. ఆదివారం జరిగే పోరులో జపాన్‌ లేదా కజకిస్థాన్‌తో పోటీ పడనుంది. ఇక రోయింగ్‌లో భారత ఆటగాడు బల్‌రాజ్‌ పన్వర్‌ ఫైనల్‌-ఎలో అడుగుపెట్టాడు. శుక్రవారం పురుషుల సింగిల్‌ స్కల్‌ ఎఫ్‌ ఎ/బి2 సెమీస్‌లో పన్వర్‌ మూడో స్థానం (7 నిమిషాల 22.22 సెకన్లు)లో నిలిచాడు. ఫైనల్‌-ఎలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రోయర్లకు పతకాలు లభిస్తాయి. టేబుల్‌ టెన్నిస్‌లోనూ భారత జట్లు శుభారంభం చేశాయి. పురుషుల విభాగం గ్రూపు-ఎఫ్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ వరుసగా 3-0తో యెమెన్‌, 3-1తో సింగపూర్‌పై విజయాలు నమోదు చేసింది.

  1. ఆసియా క్రీడలకు చైనా ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 1990లో బీజింగ్‌లో, 2010లో గాంగ్జౌలో ఈ క్రీడలు జరిగాయి.
  2. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌ ఇప్పటివరకూ గెలిచిన పతకాలు 672. ఇందులో 155 స్వర్ణాలు, 201 రజతాలు, 316 కాంస్యాలున్నాయి. ఓవరాల్‌గా భారత్‌ అయిదో స్థానంలో ఉంది. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఇరాన్‌ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
  3. ఆసియా క్రీడలు ఇప్పుడు 6 నగరాల్లో జరగనున్నాయి. హాంగ్‌జౌతో పాటు హుజౌ, నింగ్బో, షావోజింగ్‌, జిన్‌వా, వెంజౌలో క్రీడలు నిర్వహిస్తున్నారు. మొత్తం 44 వేదికల్లో పోటీలుంటాయి.
  4. ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన అయిదుగురు భారత అథ్లెట్లు బరిలో ఉండటం ఆసియా క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి. నీరజ్‌ చోప్రా, పీవీ సింధు, బజ్‌రంగ్‌ పునియా, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహెయిన్‌ ఒలింపిక్స్‌ పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే.
  5. ఇవి 19వ ఆసియా క్రీడలు. 1951లో మొట్టమొదటి సారి భారత్‌లోనే ఆసియా క్రీడలు జరిగాయి. 1954 తర్వాత నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ సారి కరోనా కారణంగా ఓ ఏడాది ఆలస్యంగా జరుగుతున్నాయి. 1982లోనూ ఈ క్రీడలకు భారత్‌ ఆతిథ్యమిచ్చింది.
  6. ఆసియా క్రీడల నిర్వహణ కోసం చైనా చేస్తున్న ఖర్చు సుమారు రూ.11,610 కోట్లు.

Asia Games 2023 : భారత్​ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్ అతడే!

Asian Games Cricket : షెఫాలీ వర్మ మెరుపులు.. సెమీస్​కు దూసుకెళ్లిన టీమ్​ఇండియా!

ABOUT THE AUTHOR

...view details