తెలంగాణ

telangana

ETV Bharat / sports

పేరుకే క్రీడా సంఘాలు.. కోచ్​ల కొరత.. మన ఆట ఎక్కడ?

23.. దాదాపు 3.5 కోట్ల జనాభా ఉన్న కేరళ ఇటీవల జాతీయ క్రీడల్లో సాధించిన స్వర్ణాలు ఇవి. 10.. సుమారు 9 కోట్ల జనాభా ఉన్న తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ గెలిచిన బంగారు పతకాలు కలిపితే ఇవి. 2015 జాతీయ క్రీడలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల ప్రదర్శన మరింతగా పడిపోయింది. పతకాల సంఖ్య పెరిగి.. ప్రదర్శనలో పైకి చేరాల్సిన రాష్ట్రాలు.. ఇలా దిగజారుతున్నాయి. ప్రభుత్వాల అశ్రద్ధ.. క్రీడాసంఘాలకు దక్కని చేయూత.. వసతుల లేమి.. కోచ్‌ల కొరత.. వెరసి తెలుగు రాష్ట్రాల క్రీడా భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతోంది.

ANDHRA PRADESH TELANGANA SPORTS
ANDHRA PRADESH TELANGANA SPORTS

By

Published : Oct 19, 2022, 8:15 AM IST

2015 జాతీయ క్రీడలకు ముందు ఏడాదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. కేరళలో జరిగిన ఆ క్రీడల్లో తెలంగాణ (8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలు- 12వ స్థానం).. ఏపీ (6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలు- 18వ స్థానం) చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేశాయి. ఏడేళ్ల తర్వాత 2022లో జరిగిన జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల అథ్లెట్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ అయితే టాప్‌-5లో నిలుస్తుందని భావించారు. కానీ 26 క్రీడాంశాల్లో 230 మంది అథ్లెట్లు బరిలో నిలిస్తే.. 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలు కలిపి 23 పతకాలు వచ్చాయి. పట్టికలో 15వ స్థానం దక్కింది. పోటీపడ్డ వాటిలో సగం కంటే తక్కువగా, 11 క్రీడాంశాల్లో మాత్రమే పతకాలు వచ్చాయి. అందులో బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, బీచ్‌ వాలీబాల్‌లో కలిపి ఆరు స్వర్ణాలు దక్కాయి. షూటింగ్‌లో ఇషా సింగ్‌, స్కేటింగ్‌లో రియా ఛాంపియన్లుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ మరోసారి 16 పతకాలే (2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలు) సాధించినప్పటికీ స్వర్ణాల సంఖ్య తగ్గింది. పట్టికలో 21వ స్థానానికి పడిపోయింది. ఈ సారి 21 క్రీడాంశాల్లో 157 మంది అథ్లెట్లు బరిలో దిగగా.. కేవలం 8 క్రీడాంశాల్లో మాత్రమే పతకాలు వచ్చాయి. ఏపీ సాధించిన రెండు బంగారు పతకాలు అథ్లెటిక్స్‌లో జ్యోతి గెలిచినవే.

క్రీడా విధానంపై కాలయాపన..
తెలంగాణలో కొత్త క్రీడా విధానంపై కాలయాపన సాగుతోంది. దీని రూపకల్పన కోసం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం మూడున్నరేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తోంది. జాతీయ క్రీడల్లో పసిడి, రజత, కాంస్య విజేతలకు తెలంగాణ ప్రభుత్వం వరుసగా రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షలు ప్రకటించింది. కానీ ఆ చెక్కులు వెంటనే అథ్లెట్లకు ఇవ్వలేదు. నజరానాలను అథ్లెట్ల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని శాట్స్‌ అధికారులను ఆదేశించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే నగదు ప్రోత్సాహకాలు అందించాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆ ఊసే లేదు. ఏపీలో గతంలో తయారుచేసిన క్రీడా విధానం ఈ ఏడాది మార్చితో ముగిసింది. నూతన విధానం దిశగా ఎలాంటి అడుగులు పడడం లేదు. 2015 జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన 83 మంది అథ్లెట్లకు కేరళ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. కానీ ఏపీలో జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వాళ్లకు ఎలాంటి సాయం దక్కడం లేదు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లేదా ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తే గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తున్నారు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించిన హాకీ క్రీడాకారిణి రజినీకి ప్రభుత్వం రూ.25 లక్షలు ప్రకటించింది. మరోవైపు ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌, షూటింగ్‌ సంచలనం ఇషా సింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్ల చొప్పున ప్రకటించింది. ఇలా ప్రపంచ స్థాయి ఈవెంట్లలో సత్తా చాటే వారికి భారీ నజరానాలు అందుతున్నా.. తర్వాతి స్థాయి క్రీడల్లో రాణిస్తూ, ప్రపంచ స్థాయికి ఎదగాలని చూస్తున్న క్రీడాకారులకు సరైన తోడ్పాటు అందడం లేదు.

పేరుకే క్రీడా సంఘాలు..
నిధులు లేకపోవడంతో క్రీడా సంఘాలకు జిల్లాల్లో, రాష్ట్రాల్లో టోర్నీలు నిర్వహించడం కష్టమవుతోంది. దాదాపు మూడేళ్ల ముందు నుంచి కొన్నింటికి నిధులు అందడం లేదు. దీంతో జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు వెళ్లే అథ్లెట్లకు ఎలాంటి భత్యాలు ఇవ్వడం లేదు. కొన్ని క్రీడాంశాల్లో స్వయంగా అథ్లెట్లే డబ్బులు పెట్టుకుని పోటీల్లో పాల్గొనాల్సిన పరిస్థితి. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన అథ్లెట్లకు సైతం ప్రభుత్వాలు భరోసా ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అథ్లెట్లు ఖర్చు పెట్టుకుని మరీ శిక్షణ తీసుకోవడంతో పాటు టోర్నీల్లో పాల్గొనడమంటే భారమే. జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన తెలుగు రాష్ట్రాల అథ్లెట్లలో దాదాపు 90 శాతం మంది ప్రైవేటు అకాడమీల్లో శిక్షణ పొందుతున్న వాళ్లే. హకీంపేటలోని ప్రధాన క్రీడా పాఠశాల నుంచి 14 మంది అథ్లెట్లు నాలుగు క్రీడాంశాల్లో పాల్గొన్నారు. కానీ ఒక్క పతకమూ రాలేదు. దీన్ని బట్టి ప్రభుత్వ శిక్షణ కేంద్రాలు, అకాడమీలు, క్రీడా పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రీడా సంఘాల్లో ఆధిపత్య పోరు, విభేదాలు మరింత నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఏపీ ఒలింపిక్‌ సంఘంలోని రెండు వర్గాల మధ్య వివాదం కోర్టులో కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోని స్టేడియాల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలకు, వాణిజ్య అవసరాలకు ఇవి వేదికలుగా మారుతున్నాయి. అత్యున్నత క్రీడా వసతి, సౌకర్యాలు, శిక్షణ విషయానికి వస్తే కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిషా, హరియాణా తదితర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు ఎంతో దూరంలో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని క్రీడా రంగం సమస్యలపై దృష్టి పెట్టి, అత్యుత్తమ శిక్షణ సౌకర్యాలు అందించడం అత్యావశ్యకం.

ఎందుకు ఇలా?
జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల ప్రదర్శన పడిపోవడానికి ప్రధానంగా ప్రభుత్వ విధానాలే కారణం. బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులు, నిధుల లేమి, క్రీడా విధానం లేకపోవడం, పతకాలు సాధించిన అథ్లెట్లకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, ప్రత్యేక రిజర్వేషన్‌ను పకడ్బందీగా అమలు చేయకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులున్నాయి. రెండు రాష్ట్రాల క్రీడా ప్రాధికార సంస్థలు పేరుకే ఉన్నాయి. వీటికి సరిపడా నిధులు లేవు. తెలంగాణలో క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్‌ అంటున్నారు కానీ అమలుపై ఎన్నో సందేహాలు. బడ్జెట్‌లో క్రీడా రంగానికి ప్రాధాన్యతే లేదు. ఏపీలో అయితే గతంలో మాదిరి రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడలకంటూ ప్రత్యేకించి వాటానే ప్రకటించలేదు. జాతీయ క్రీడల్లో త్రివిధ దళాల అథ్లెట్లు ప్రాతినిథ్యం వహించే సర్వీసెస్‌ అగ్రస్థానంలో నిలవగా.. మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌, పంజాబ్‌ వరుసగా రెండు నుంచి పది స్థానాల వరకు దక్కించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అత్యుత్తమ క్రీడా విధానాన్ని (స్పోర్ట్స్‌ పాలసీ) పాటిస్తున్నారు. ఒలింపిక్స్‌, ప్రపంచ, జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు గెలిచిన అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు, ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

కోచ్‌ల కొరత..
తెలుగు రాష్ట్రాల్లో కోచ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. తెలంగాణలో మొత్తం 120 మంది శాట్స్‌ కోచ్‌లున్నారు. అందులో రెగ్యులర్‌ కోచ్‌లు కేవలం ఆరుగురే. మిగతావాళ్లలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, పే అండ్‌ ప్లే తదితర కోచ్‌లున్నారు. ఈ కోచ్‌లను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం నాన్చుతోంది. ప్రస్తుతం ఆ దస్త్రం ఆర్థిక శాఖ వద్ద ఉంది. జిల్లాకు కనీసం 10 మంది కోచ్‌లను నియమించినా మొత్తం 330 మంది కావాలి. ఏపీలో రెగ్యులర్‌ శిక్షకులు లేకపోవడం, కాంట్రాక్ట్‌, పొరుగు సేవల ద్వారా కోచ్‌లను నియమించడం ప్రధాన లోపం. సుమారు 150 మంది ఔట్‌ సోర్సింగ్‌ కోచ్‌లున్నారు. జిల్లాకు పది మంది అయినా 260 మంది కావాలి. అథ్లెట్లను ఛాంపియన్లుగా తీర్చిదిద్దే తమ పరిస్థితి ఇలా ఉంటే ఇక మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయంటూ కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పే అండ్‌ ప్లే (నగదు చెల్లించి ఆడుకోవడం) విధానం క్రీడాకారులకు శాపంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details