అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్)లో రెండు వర్గాల ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నెల 22న ఆరంభమయ్యే చెస్ ఒలింపియాడ్ కోసం ఈ రెండు వర్గాలు వేర్వేరుగా భారత జట్లను ప్రకటించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. కొంత కాలంగా ఏఐఎస్‌ఎఫ్‌లో అధ్యక్షుడు పీఆర్ వెంకట్రామరాజా, కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్‌ల నేతృత్వంలో వేర్వేరుగా రెండు వర్గాలు ఏర్పడి వివిధ అంశాలపై కలహించుకుంటున్నాయి. ఇప్పుడు చెస్ ఒలింపియాడ్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఈ రెండు వర్గాలు వేర్వేరుగా జట్లను ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఏఐసీఎఫ్లో లుకలుకలు.. చెస్ ఒలింపియాడ్‌కు రెండు జట్లు - ఆనంద్ వార్తలు
అఖిల భారత చెస్ సమాఖ్యలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాజాగా చెస్ ఒలింపియాడ్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఈ రెండు వర్గాలు వేర్వేరుగా జట్లను ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, విదిత్ గుజరాతి ఈ రెండు వర్గాలు ప్రకటించిన జట్లలోనూ ఉండగా.. జూనియర్ స్థాయిలో మాత్రం ఒక్కో వర్గం ఒక్కో జాబితాను రూపొందించింది. చౌహాన్ వర్గం పై నలుగురితో పాటు నిహాల్ సారిన్, వైశాలిలను రెగ్యులర్ క్రీడాకారులుగా.. హరికృష్ణ, అధిబన్, ప్రజ్ఞానానంద, భక్తి కులకర్ణి, తానియా సచ్‌దేవ్, దివ్య దేశ్‌ముఖ్‌లను రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది.
రాజా వర్గం ఆనంద్, హంపి, హారిక, విదిత్‌లతో పాటు హరికృష్ణ, భక్తి, ఆరాధ్య, మిత్రభ, సృష్టి, అర్పితలతో జట్టును ప్రకటించింది. ఇందులో రిజర్వ్ క్రీడాకారులు లేరు. వీటిలో ఏ జట్టు అధికారికమో తెలియక క్రీడాకారులు అయోమయంలో ఉన్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.