సాంకేతిక పరిజ్ఞానం అంటే గుర్తొచ్చే పేరు జపాన్.. ఆ పేరుకు తగ్గట్లే జులై 23న ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. ఆ క్రమంలోనే కరోనా వైరస్ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసింది. స్టేడియంలో ఉండే అభిమానుల్లో ఎవరికైనా ఈ మహమ్మారి ఉంటే వెంటనే నిర్వహకులకు సమాచారం అందుతుంది. అయితే కరోనా కారణంగా తాజాగా విదేశీ అభిమానులపై నిషేధం పడటం వల్ల ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి రూపొందించిన ఈ యాప్ నిరుపయోగంగా మారనుందని జపాన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
రూ.485 కోట్లతో ఒలింపిక్స్ కోసం యాప్ రూపొందిస్తే..!
టోక్యో ఒలింపిక్స్ కోసం రూపొందించిన కరోనా యాప్.. ఇప్పుడు నిరుపయోగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ అభిమానులపై నిషేధం పడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇంతకీ ఏమైంది?
జపాన్ లోనే అతి పెద్ద టెలికాం సంస్థ ఎన్టీటీ కమ్మునికేషన్ కార్పొరేషన్ తయారు చేసిన ఈ ఎన్టీటీ మొబైల్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ యాప్ కోసం జపాన్ ఒలింపిక్ కమిటీ దాదాపు రూ. 485 కోట్లు ఖర్చు పెట్టిందట. మొదట్లో జపాన్ దేశంలో కరోనాను కనిపెట్టడానికి రూపొందించిన కొకా యాప్(కొవిడ్-19 కాంటాక్ట్ కన్ఫార్మింగ్ యాప్) వ్యయం కంటే దీనికైన ఖర్చు ఇరవైరెట్లు ఎక్కువట.
భిన్నమైన భాషలతో కూడిన ఈ యాప్ జూన్‌లో విడుదల కావాల్సి ఉంది. ఈ యాప్‌ను అభిమానులు డౌన్లోడ్ చేసుకుంటే వారి వివరాలను శాటిలైట్ పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షించే వీలుంటుందని ఒలింపిక్ సంఘం చెబుతోంది. టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ మొదట అనుకున్న వ్యయం రూ.లక్షా 10 వేల కోట్లు కాగా.. తాజాగా ఈ ఖర్చు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగిందని అంచనా.