ప్రపంచంలోని వివిధ దేశాలు ఆటల కోసం ఓ ప్రత్యేక రోజును కేటాయించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని (National sports day) జరుపుకుంటున్నాయి. అదే విధంగా భారత్‌లోనూ జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆగస్టు 29న జరిగే నిర్వహించే ఈ వేడుకను రాష్ట్రీయ ఖేల్ దివాస్ అని కూడా పిలుస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో స్పోర్ట్స్ డేలో పాల్గొంటారు. అసలు ఈ స్ట్పోర్ట్స్ డేను ఎందుకు నిర్వహిస్తారు? ఈ వేడుకలను ఈరోజునే(ఆగస్టు 29) జరపడం వెనుక కారణమేంటో తెలుసుకుందాం.
క్రీడా దినోత్సవం ఎందుకంటే..
జీవితంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయని భావితరాలకు అవగాహన పెంచే విధంగా.. క్రీడల ఆవశ్యకాన్ని తెలియపరిచే కార్యక్రమాలను నిర్వహించడమే దీని ప్రధాన లక్ష్యం. స్పోర్ట్స్ డే సందర్భంగా నిర్వహించే వివిధ క్రీడా టోర్నీలు ఉత్తమ ప్రతిభను వెలికి తీయడానికి సహాయపడతాయి.
ఆగస్టు 29.. దాని ప్రత్యేకత
అయితే జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29నే ప్రత్యేకంగా జరపడం వెనుక కారణం.. ధ్యాన్‌చంద్. భారత హాకీ చరిత్రలో లెజెండరీ ఆటగాడిగా గుర్తింపు పొందిన ధ్యాన్‌చంద్.. మైదానంలో అడుపెడితే ఆయన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థులు మల్లగుల్లాలు పడేవాళ్లు.
1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ధ్యాన్‌చంద్.. 1928, 32, 36లలో జరిగిన వరుస ఒలింపిక్స్‌లలో భారత జట్టుకు స్వర్ణాలు సాధించి పెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతున్నారు. ధ్యాన్‌చంద్ ఆటకు ముగ్ధుడైన క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్.. "క్రికెట్లో బ్యాట్స్‌మెన్ పరుగులు చేసినట్లు.. హాకీలో గోల్స్ చేశాడు" అని కితాబు ఇచ్చారు.
జాతీయ క్రీడా దినోత్సవం ఎలా జరుపుకొంటారు?
దేశంలో ఉన్న విద్యాసంస్థలు, క్రీడా సంస్థలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29న ఘనంగా నిర్వహిస్తారు. పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ రోజును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఎందుకంటే క్రీడాకారులు ఎక్కువగా ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం.
ఈ ఏడాది.. క్రీడా పురస్కార వేడుక వాయిదా పడింది. గతేడాది కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. ఈసారి పారాలింపిక్స్ తర్వాత ఇరు విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించనుంది.
ఇదీ చదవండి :Tokyo Paralympics: చరిత్ర సృష్టించిన భవీనా.. భారత్‌కు తొలి పతకం