Asian Champions Trophy 2021: ఒలింపిక్ కాంస్య పతక విజేత భారత పురుషుల హాకీ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటడానికి సిద్ధమైంది. టోర్నీ తొలి రోజు, మంగళవారం కొరియాను ఢీకొంటుంది. 15న ఆతిథ్య బంగ్లాదేశ్‌తో, 17న పాకిస్థాన్‌తో, 19న ఆసియా క్రీడల విజేత జపాన్‌తో తలపడుతుంది. డిసెంబరు 21న సెమీఫైనల్స్, 22న ఫైనల్ జరుగుతాయి.
టోర్నీలో మంచి ఆరంభం ముఖ్యమని భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించాడు. "కొరియా మంచి జట్టు. మా దాడులను నిలువరించే సామర్థ్యం ఆ జట్టుకు ఉంది. ఇదే వేదికలో 2017 ఆసియాకప్ సందర్భంగా మాతో మ్యాచ్‌ను కొరియా 1-1తో డ్రా చేసుకుంది. కాబట్టి మేం ఉదాసీనతకు చోటివ్వకూడదు. ఈ టోర్నమెంట్ మాకు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఇదే మాకు మొదటి టోర్నీ. మెరుగ్గా ఆరంభిస్తే మా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది" అని అన్నాడు.