'అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్' (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా)లో సభ్యుడిగా ఎన్నికయ్యారు. మలేసియా కౌలాలంపూర్‌లో శనివారం 29వ ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (ఏఎఫ్సీ) సమావేశం జరిగింది. ఇక్కడ నిర్వహించిన ఓటింగ్‌లో పటేల్‌కు 46 ఓట్లకు గానూ 38 ఓట్లు వచ్చాయి.
ఫిఫా కౌన్సిల్లో సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడిగా ప్రఫుల్ పటేల్ రికార్డులకెక్కారు. ఐదుగురు సభ్యులుండే ప్యానెల్లో పటేల్ ఒకరు. ఇందులో ఓ మహిళా సభ్యురాలు కూడా ఉంటారు. 2019 నుంచి 2023 వరకు వీరు సేవలందిస్తారు.
"నేను ఈ గౌరవానికి తగిన వాడినని నమ్మి.. మద్దతు తెలిపిన ఏఎఫ్సీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఫిఫా కౌన్సిల్ సభ్యుడి బాధ్యత ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది. నా దేశానికే కాదు.. ఆసియా ఖండం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తాను. బాధ్యతలను విధేయతతో నిర్వహిస్తాను. - ప్రఫుల్ పటేల్, ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు.
ప్రఫుల్కి ఈ గౌరవం దక్కడం పట్ల భారత ఫుట్‌బాల్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఫుట్‌బాల్ క్రీడను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ప్రఫుల్ ముఖ్య పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆ పదవికి ప్రఫుల్ తగిన వ్యక్తి అని ఏఐఎఫ్ఎఫ్ ఉపాధ్యక్షురాలు సుబ్రతా దత్తా తెలిపారు.