Yuzvendra Chahal Comments On MS Dhoni : టీమ్ఇండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్.. భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కెప్టెన్‌గా ఎంత కూల్‌గా ఉంటాడో.. సహచర ఆటగాళ్లతోనూ అదే విధంగా సరదాగా ఉంటాడని అన్నాడు. అందుకే ఇతర జట్లలోని ఆటగాళ్లు కూడా మహీని ఆరాధిస్తారని తెలిపాడు. మహీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా.. వారి ఆటను మెరుగుపరచుకోవడంలో సూచనలు, సలహాలు ఇస్తుంటాడని పేర్కొన్నాడు. ధోనీ కెప్టెన్సీలో మంచి స్పిన్నర్‌గా ఎదిగిన యుజ్వేంద్ర చాహల్.. మహీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.
అయితే, ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో తన చిలిపి చేష్టలతో సహచరులను ఆటపట్టించే చాహల్.. ధోనీ ఎదురుపడితే మాత్రం సైలెంట్ అయిపోతాడట. ఈ విషయాన్ని స్వయంగా చాహల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'కేవలం ధోనీ ముందు మాత్రమే సైలెంట్‌గా ఉంటాను. అతడు నా ముందుకు వస్తే.. నా నోరు ఆటోమేటిక్‌గా మూతపడుతుంది. ఆ సమయంలో అనవసర విషయాలు మాట్లాడను. మహీ భాయ్ ముందు సైలెంట్‌గా కూర్చుని.. అతడు అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెబుతాను. లేకపోతే అలా సైలెంట్‌గా ఉండిపోతాను' అని చాహల్ చెప్పుకొచ్చాడు.