WTC Final 2023 IND VS AUS : ఆస్ట్రేలియా జట్టును చూస్తుంటే టీమ్‌ఇండియాకు కఠిన పరీక్ష తప్పదనిపించేలా ఉంది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు వార్నర్, ఖవాజా, స్మిత్, లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రేవిస్ హెడ్, స్టార్క్, అలెక్స్ కేరీ, బోలాండ్, లైయన్,.. ఇలా జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ డబ్ల్యూటీసీ జరిగే ఫైనల్ వేదిక ఓవల్ కావడం వల్ల.. పేస్ దాడితో కంగారూ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇప్పటికే మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్ ఎడిషన్‌లో(2021లో).. ఇంగ్లాండ్(సౌథాంప్టన్) గడ్డపై న్యూజిలాండ్ పేస్ ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సారి ఆసీస్ పేస్ దళాన్ని ఎలా ఎదుర్కుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
WTC Final 2023 Australia : మొత్తంగా ఈ డబ్ల్యూటీసీ సైకిల్(2021- 23) గమనిస్తే.. ఆస్ట్రేలియా మంచి జోరు మీద ఉంది. 19 మ్యాచుల్లో 11 విజయాలు, 5 డ్రాలతో పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్‌తో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు చేసిన టాప్ 7 బ్యాటర్లలో నలుగురు ఆస్ట్రేలియా ప్లేయర్సే ఉన్నారు. అత్యధిక వికెట్లన తీసింది ఆసీస్ బౌలరే. కాబట్టి ఆసీస్ ఎదుర్కోవడం భారత్‌కు పెద్ద కష్టమే అనేలా అనిపిస్తోంది.
బలంగా బ్యాటింగ్ ఆర్డర్..
WTC Final Australia batting : ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్‌లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.
- ఓపెనర్ ఖవాజా ప్రస్తుతం తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో 69.91 యావరేజ్‌తో 1608 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్స్‌లో రూట్ (1915) తర్వాత అతడే ఉన్నాడు. చివరగా భారత్‌లో ఆడిన బోర్డర్-గావస్కర్ సిరీస్‌లోనూ 333 అత్యధిక పరుగులు చేసింది అతడే కావడం విశేషం.
- క్రీజులో కుదురుకుంటే చాలు సెంచరీలు బాదే లబుషేన్ కూడా ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. ఈ డబ్ల్యూటీసీ చక్రంలో అతడు 19 మ్యాచ్‌ల్లో 1509 పరుగులు సాధించాడు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడడం, బౌలర్ల లయను దెబ్బతీయగలిగే నైపుణ్యం అతడి సొంతం.
- స్మిత్.. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 19 మ్యాచ్‌ల్లో 1252 పరుగులు చేశాడు. నిజానికి టీమ్‌ఇండియాతో మ్యాచ్ అనగానే.. రెచ్చిపోతుంటాడు స్మిత్. అతడు భారత్‌పై 18 టెస్టుల్లో 65.06 యావరేజ్‌తో 1887 రన్స్ చేశాడు. ఈ యావరేజ్ అతడి కెరీర్ సగటు (59.80) కన్నా ఎక్కువ. ఇంగ్లాండ్‌లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. 16 టెస్టుల్లో 1727 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఓవల్‌లోనూ గొప్పగానే ఉంది. అక్కడు 3 టెస్టుల్లో ఏకంగా 97.75 యావరేజ్‌తో 391 రన్స్ చేశాడు. స్మిత్‌ను కూడా క్రీజులో కాస్త కుదురుకుంటే చాలు.. చెలరేగిపోతాడు. మరో విషయమేమిటంటే.. స్మిత్, లబుషేన్ కౌంటీల్లో ఆడుతూ.. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం బాగా సిద్ధమయ్యారు.
- ఇకపోతే మిడిలార్డర్‌లో హెడ్ కీలక ఆటగాడిగా మారాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 17 మ్యాచ్‌ల్లో 1208 పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో, ఛేదనలో లక్ష్యాన్ని అందుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు.