WTC Final 2023 Teamindia Squad : ఐపీఎల్ సీజన్ ముగిసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. దీంతో క్రికెట్ ప్రేమికుల దృష్టంతా ఈ నెల 7న ఆస్ట్రేలియాతో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ మీదే ఉంది. అయితే ఈ మెగాటోర్నీ కోసం భారత్ 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ టీమ్‌లో బౌలింగ్ విభాగం పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. నిలకడైన ప్రదర్శన కనిపించడం లేదనే చెప్పాలి. పేసర్లు షమి, సిరాజ్, జైదేవ్ ఉనద్కత్, శార్దూల్, ఉమేశ్‌తో పాటు స్పిన్నర్లు జడేజా, అశ్విన్, అక్షర్ టీమ్‌కు సెలెక్ట్ అయ్యారు. అయితే ఫైనల్ జరగనున్న వేదిక లండన్‌లోని ఓవల్. ఇక్కడ ఫాస్ట్‌బౌలర్లదే ఆధిపత్యం ఉంటుంది! ఈ నేపథ్యంలో మన పేసర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది.
ఈ ఇద్దరే కీలకం..
WTC Final 2023 Teamindia pacers : గాయంతో బుమ్రా గైర్హాజరీ అవ్వడం వల్ల జట్టులో షమి, సిరాజ్ కీలకం కానున్నారు. ముఖ్యంగా షమి అనుభవం జట్టుకు బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. రీసెంట్గా ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్లో అత్యధిక వికెట్లు(28) తీసి.. మంచి జోరు మీదున్నతడికి.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ మంచి రికార్డు(రీసెంట్గా) ఉంది.
నిలకడగా ఒకే ప్లేస్‌లో బౌలింగ్ చేయడం, పిచ్ పరిస్థితుల ఆధారంగా వికెట్లను తీయడం, పేస్‌ను అందుకునే విధానం, స్వింగ్‌పై నియంత్రణ, అవసరమైనప్పుడు బౌన్సర్లను సంధించడం.. ఇలా అతడి నైపుణ్యాలన్ని ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అతడు మరింతగా రెచ్చిపోయి ఆడుతున్నాడు. బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్‌తో బాగా రాణిస్తున్నాడు. అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్‌లో అతడి రికార్డు మాత్రం కాస్త కలవరపెట్టేలా ఉంది. 12 టెస్టుల్లో 42.14 యావరేజ్‌తో 34 వికెట్లు మాత్రమే తీశాడు.
ఇక సిరాజ్ విషయానికొస్తే.. తక్కువ కాలంలోనే టీమ్‌ఇండియా టెస్టు టీమ్‌లో కీలక పేసర్‌గా ఎదిగాడు. దూకుడుగా ఉంటూ పేస్‌తో బ్యాటర్లపై ఆధిపత్యం చలాయించే అతడు కూడా నిలకడగా సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేయగలడు. ముఖ్యంగా కొత్త బాల్‌ను రెండు వైపులా స్వింగ్ చేయడం, పిచ్ నుంచి అధిక బౌన్స్ రాబట్టగలడు. తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా బౌలింగ్ చేయగలడు. ఇప్పటివరకు 18 టెస్టుల్లో 47 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌లో 5 టెస్టుల్లో 18 వికెట్లు తీశాడు.
వీరు బంతితో పాటు..
- స్టార్టింగ్‌లో బంతిని స్వింగ్ చేయడం, జట్టుకు అవసరమైన సమయంలో వికెట్లు అందించడం.. శార్దూల్ నైపుణ్యత. ఫీల్డింగ్ ఏర్పాట్లకు తగ్గట్టుగా.. బ్యాటర్లను ఉచ్చులోకి దింపుతాడు. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగలడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా పోరాడగలడు. 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బ్రిస్బేన్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కీలకమైన 67 పరుగులు చేశాడు. అలానే మొత్తం 7 వికెట్లు తీశాడు. ఇక అదే ఏడాది సెప్టెంబర్‌లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. 3 వికెట్లను పడగొట్టాడు. మొత్తంగా ఇప్పటివరకూ 8 టెస్టులు ఆడిన అతడు 27 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
- దేశవాళీల్లో మంచి ప్రదర్శనతో 12 ఏళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో(నిరుడు బంగ్లాదేశ్‌పై)కి అడుగుపెట్టాడు జైదేవ్. ఈ ఎడమ చేతి వాటం పేసర్.. తన బౌలింగ్ వైవిధ్యంతో మంచి ప్రభావం చూపగలడని చెప్పొచ్చు.
- సీనియర్ పేసర్ ఉమేశ్.. ఇప్పటివరకూ ఇంగ్లాండ్‌లో ఆడిన రెండు టెస్టుల్లో 9 వికెట్లు తీశాడు. ఓవల్‌లో ఆడిన మ్యాచులో 6 వికెట్ల తీసి ఆకట్టుకున్నాడు.