జట్టులో అంతా స్టార్ ప్లేయర్లే.. అత్యంత బలమైన జట్టు కూడా.. కానీ ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు. పేలవ ప్రదర్శనతో వరుసగా 5 ఓటములను అందుకుంది. బ్యాటింగ్ బాగా చేస్తే బౌలింగ్‌లో.. బౌలింగ్‌లో మంచిగా రాణిస్తే బ్యాటింగ్‌లో వైఫల్యం అవుతూ పరాజయాలను మూటగట్టుకుంటోంది. ఐపీఎల్లో మెన్స్ టీమ్ ఎలాంటి విమర్శలను ఎదుర్కొంటుందో.. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జరుగుతున్న తొలి సీజన్లో ఇప్పటి వరకు ఒక్క సక్సెస్‌ను కూడా నమోదు చేయలేక చతికిలపడింది. కెప్టెన్ స్మృతి మంధాన ప్రస్తుతం ఈ టోర్నీలో విఫలమవుతోంది. ఆమె కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోతుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు! ఆమె వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బ తీస్తోందని అంటున్నారు. ఆమె బ్యాట్ ఝులిపించాలని ఆశపడుతున్నారు. ఇకపోతే మంధాన వైఫల్యంతో పాటు జట్టులోని మిగతా ప్లేయర్స్ కూడా సమిష్టిగా రాణించలేకపోతున్నారు.
రీసెంట్గా దిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చెందింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు సాధించలేక ఓటమి ముందు తల వంచింది. అలా వరుస ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉండిపోయిది. అయితే ఈ ఓటములు తన ఖాతాలో వేసుకున్నప్పటికీ.. టోర్నీలో ముందడుగు వేసే మరో అవకాశం ఆర్సీబీకి ఉంది.