WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో ముంబయి ఇండియన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇఇప్పటికే గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లపై గెలుపొందిన హర్మన్ సేన.. ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్ పై జయ కేతనం ఎగురవేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. దిల్లీపై జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దిల్లీ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి ఓపెనర్లు యాస్తికా భాటియా(41; 32 బంతుల్లో 8 ఫోర్లు), హీలీ మాత్యూస్ (32; 31 బంతుల్లో 6 ఫోర్లు) పరుగులతో రాణించారు. నాట్ సివర్ బ్రంట్(23*), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(11*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లు అలిస్ క్యాప్సీ, తారా నోరిస్ చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ.. 18 ఓవర్లలో 105 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లానింగ్(43; 41 బంతుల్లో 5 ఫోర్టు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాణించింది. జెమీమా రోడ్రిగ్స్(25; 18 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది. షెఫాలీ వర్మ(2), అలీస్ క్యాప్సీ(6), మరిజన్నే కాప్(2), జొనాసెన్(2), తనియా భాటియా(4), మిన్ను మని(0), రాధా యాదవ్(10), శిఖా పాండే(4), తారా నోరిస్(0) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. ముంబయి బౌలర్లు సైకా ఇషాక్(3), వాంగ్(3) హీలీ మాత్యూస్(3) వికెట్ల తీసి చెలరేగిపోయారు. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది. కాగా, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఇది తొలి ఓటమి.