World Cup 2023 Team India : బౌలింగ్ అయిపోయింది.. ఇక బ్యాటింగే మిగిలిందని తెలిస్తే ఇక అంతే.. డగౌట్లో ఓ నలుగురు మినహా మిగతా ప్లేయర్లందరూ జెర్సీలు మార్చేసి హాయిగా సేద తీరుతున్నారు. ఓపెనర్లు.. ఆ తర్వాత మరో ఇద్దరు తప్ప మన బ్యాటర్లందరూ కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తున్నారు. బ్యాటింగ్ వెళ్లాల్సి వస్తుందేమో.. వికెట్లు పడితే మన జట్టు కష్టాలు పడుతుందేమో అంటూ ఆందోళనే లేదు. టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్ అద్భుత ప్రదర్శనే దీనికి కారణం. ప్రపంచకప్‌లో మిగతా జట్లతో పోలిస్తే మన టాప్‌ఆర్డర్ బ్యాటర్లందరూ ఓ రేంజ్లో చెలరేగిపోతున్నారు. ఛేదనకు దిగడం నుంచి.. లక్ష్యాన్ని అందుకోవడం వరకు.. ఇదే తీరుగా మారింది. ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్.. ఆ తర్వాత విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇలా అందరూ గొప్పగా ఆడి తమ ఫామ్‌ను ప్రదర్శిస్తున్నారు.
ముఖ్యంగా జట్టుకు మూల స్తంభాలైన రోహిత్, విరాట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ద్వయం.. ప్రపంచకప్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి జట్టు విజయానికి బాటలు వేస్తున్న రోహిత్ వెనుక నేనున్నాను అంటూ విరాట్ మిగతా పనిని పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరు చెరో శతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.
మరోవైపు యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా పరిస్థితులకు అనుగుణంగా పరుగులు చేస్తూ పలు రికార్డులను తమ పేరిట లిఖించుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇన్నింగ్స్ ఆడిన రాహుల్.. అందులో 150 పరుగులు చేశాడు. అయితే ఒక్కసారి కూడా అతడు ఔట్ కాకపోవడం విశేషం.