World Cup 2023 Team India :ఈ ఏడాది ప్రపంచ కప్ మన సొంతం కాలేదన్న బాధ కంటే.. కోహ్లి, రోహిత్‌లకు ఇదే చివరి కప్పు కావచ్చన్న అంచనాలు అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది. 2011 కప్పు గెలిచిన జట్టులో కోహ్లీ సభ్యుడైనప్పటికీ.. ఆ విజయంలో అతడి పాత్ర నామమాత్రమే. అయితే విరాట్.. ఓ సూపర్ స్టార్‌గా ఎదిగాక జట్టుకు కప్పు అందిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఇక ఈ మెగా టోర్నీలో 3 శతకాలు సహా 765 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచిన విరాట్.. జట్టును విజేతగా నిలపడానికి తనవంతు కృషి చేశాడు. జట్టు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించాడు.
మరోవైపు 2011 ప్రపంచకప్ జట్టులో భాగం కాలేకపోయిన రోహిత్‌కు.. ఈసారి కెప్టెన్‌గా జట్టును నడిపించే అవకాశం వరించింది. ఓ కెప్టెన్‌గానే కాకుండా ఓ బ్యాటర్‌గానూ గొప్ప రోహిత్ ప్రదర్శన చేశాడు. వెన్నంటే ఉండి జట్టుకు పలు విజయాలను అందించాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 597 పరుగులు సాధించిన హిట్ మ్యాన్.. ఓ నాయకుడిగా అతడి నైపుణ్యాలను చూపించి సత్తా చాటారు. కానీ ఈ ఇద్దరూ స్టార్ క్రికెటర్లు కప్పుకి అడుగు దూరంలో నిలిచిపోవడం పట్ల అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 36 ఏళ్లు. తనకంటే విరాట్ ఏడాదే చిన్నవాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న ఈ ఇద్దరూ ఇంకో నాలుగేళ్ల తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడటం కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పటి రోజులంటే వేరు కానీ.. ఇప్పుడు వన్డేలకు కూడా ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. వన్డే ప్రపంచకప్ జరగడానికి ఒకట్రెండేళ్ల ముందు మాత్రమే తరచుగా ఆ ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగుతుండేవి. అయితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉండటం వల్ల భారత్ సహా ఏ జట్టూ సంవత్సరం పాటు పెద్దగా వన్డేలు ఆడే అవకాశాలు కనిపించటం లేదు. ఆ తర్వాత కూడా ఎప్పటికి తరచుగా వన్డేలు ఆడతారో లేదో కూడా తెలియదు.
ఈ లోపు భవిష్యత్ దిశగా జట్టు ప్రణాళికలు మారిపోవచ్చు. 2027 ప్రపంచకప్ దిశగా యంగ్ ప్లేయర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని.. బోర్డు, సెలక్టర్లు భావించవచ్చు. మరోవైపు వన్డేలు శారీరకంగా, మానసికంగా అనేక సవాళ్లు విసురుతాయి కాబట్టి వయసు పెరుగుతున్న రోహిత్, కోహ్లి.. ఇక చాలనుకుని ఈ ఫార్మాట్‌లో రిటైర్మెంట్ చెప్పే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇటీవలి ప్రపంచకప్‌లో ఈ ఇద్దరి ప్రదర్శన తర్వాత వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగితే బాగుంటుందనే ఆశ అభిమానుల్లో కలుగుతోంది. ఎలాగో ఐపీఎల్‌లోనూ ఆడతారు. అందులో కూడా దూకుడు చూపించారంటే కోహ్లి, రోహిత్ టీ20 ప్రపంచకప్‌లో ఆడాలన్న డిమాండ్లు కూడా పెరగొచ్చు. ఆ టోర్నీలో వాళ్లిద్దరూ జట్టుకు సపోర్ట్ అవుతారని అభిమానుల ఆశ. దీంతో టీ20ల్లోకి వీరు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.