World Cup 2023 Pakistan :ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో పాకిస్థాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు కేవలం రెండు గెలుపులతోనే నెట్టుకుంటూ వచ్చిన పాక్ జట్టు.. తాజాగా జరిగిన మ్యాచ్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఆరు పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో ఐదో స్థానానికి ఎగబాకి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. దీంతో పాక్ జట్టు కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే ఇప్పటికీ ఆ జట్టు సెమీస్ చేరుకోవాలంటే దాని కోసం చాలా కష్టపడాల్సి ఉంది.
రానున్న రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ భారీ విజయాలు సాధించాల్సి ఉంది. అయితే ఆ రెండు మ్యాచుల్లో పాక్.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లతో తలపడాల్సి ఉంది. అయితే అది సాధ్యపడే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకుల మాట. ఒకవేళ ఈ రెండు జట్లను పాక్ ఓడించిప్పటికీ పలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటంటే..
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. ఈ రెండింట్లో ఏదో ఒక జట్టు అఫ్గానిస్థాన్ ఓడించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, శ్రీలంకలు కలిసి న్యూజిలాండ్‌ను ఓడించాలి. ఇక టీమ్ఇండియా.. శ్రీలంక,నెదర్లాండ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగాక కూడా పాకిస్థాన్ సెమీస్‌కు చేరడం అంత సులువైన పని కాదనిపిస్తుంది. ఒకవేళ పైన అనుకున్నట్లు జరిగినా కూడా పాక్.. కివీస్, ఇంగ్లాండ్‌లపై భారీ విజయాలు సాధించడమనేది సాధ్యపడకపోవచ్చు. దీంతో ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపు లేనట్లే అనిపిస్తోంది.