మహిళల టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఆసీస్ జట్టు అదరగొట్టింది. భారత జట్టు ముందు భారీ లక్ష్యం నిలిపింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. బెత్ మూనీ అర్ధశతకంతో రాణించింది. సారథి మెగ్ లానింగ్ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. వికెట్ కీపర్ అలిసా హీలీ 25, ఆష్లే గార్డ్‌నర్ 31 పరుగులతో రాణించారు. భారత స్టార్ బౌలర్ రేణుకా సింగ్ తీవ్రంగా నిరాశపర్చింది. నాలుగు ఓవర్లలో 41 పరుగులు సమర్పించుకుంది. శిఖా పాండే రెండు వికెట్లు... దీప్తి శర్మ, రాధా యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ అల్సా హేలీ (25), మూనీ (54)జోడీ.. తొలి వికెట్‌కి 7.3 ఓవర్లలో 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ జోడి పవర్ ప్లేలో పోటీపడి మరీ క్రీజు వెలుపలికి వెళ్లి అదిరిపోయే షాట్లు బాదింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్ లానింగ్(49), గార్డ్‌నర్ (31) కూడా అదే దూకుడును కొనసాగించారు. భారత్ బౌలర్లకు ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. టీమ్ఇండియా ఐదుగురు బౌలింగ్ చేయగా.. ప్రతిఒక్కరూ ఓవర్‌కు సగటున 7 నుంచి 8 పరుగులు సమర్పించుకున్నారు. పేసర్ రేణుక మరీ దారుణంగా 4 ఓవర్లలోనే 41 పరుగులు ఇచ్చింది. అలానే ఈ మ్యాచ్‌తో టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్నేహ్ రాణా కూడా 4 ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకుంది. వీరిద్దరూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఇంకా చెప్పాలంటే మన ఫీల్డరూ బంతిని అడ్డుకోవడంలో చాలా సార్లు విఫలమయ్యారు. క్యాచ్‌లు పట్టుకోలేకపోయారు.