ఐపీఎల్.. ప్రపంచంలోనే అత్యుత్తమ, రిచ్ లీగ్. యంగ్ ప్లేయర్స్ టాలెంట్ చాటే వేదికగా.. అత్యంత ప్రతిభ, నైపుణ్యం గల క్రికెటర్లను జాతీయ జట్టుకు అందించే వారథిగా.. భారత క్రికెట్ జట్టును మరింత పటిష్ఠంగా మార్చేందుకు ఈ లీగ్ ఎంతో దోహదపడింది. అయితే ఇప్పుడిక భారత అమ్మాయిల క్రికెట్లో విప్లవం రాబోతున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా చర్చల్లో బాగా నాని.. ఎట్టకేలకు మరొక్క రోజులో మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కార్యరూపం దాల్చనుంది. అంతర్జాతీయ అమ్మాయిల క్రికెట్లోనూ భారత్ ఆధిపత్యానికి, అలానే స్వదేశంలోనూ క్రికెట్ ఆదరణ రెట్టింపు చేసేందుకు ఈ లీగ్ నాంది పలకనుంది. శనివారం(మార్చి 4) నుంచి ప్రారంభంకానుంది. మార్చి 4 నుంచి 26 వరకు జరిగే ఈ మెగా టోర్నీ తొలి సీజన్‌లో ఐదు జట్లు తలపడుతున్నాయి. దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ఇందులో పాల్గొననున్నాయి.
అలా మొదలు.. 2005లో తొలిసారి వన్డే ప్రపంచకప్ తుది పోరుకు చేరిన తర్వాత భారత అమ్మాయిల క్రికెట్ జట్టు దశ మారింది. 2006లో మహిళల క్రికెట్ బాధ్యతలను బీసీసీఐ అందుకుంది. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో దేశంలో వనితల క్రికెట్‌కు గుర్తింపు దక్కింది. 2020 టీ20 ప్రపంచకప్ తుదిపోరు, కామన్వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్, అలాగే ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్ విజయం.. ఇలా అన్ని అంశాలు మన అమ్మాయిల క్రికెట్‌కు క్రేజ్‌ను పెంచాయి. ఇప్పుడీ మెగా లీగ్‌తో మన అమ్మాయిల క్రికెట్ మరోస్థాయికి చేరనుంది.
ఆసీస్ అలానే మరోస్థాయికి.. ప్రస్తుతం ప్రపంచ మహిళల క్రికెట్లో బలమైన జట్టు పేరు అనగానే ఠక్కున వినిపించేది ఆస్ట్రేలియా జట్టే. రీసెంట్గా రికార్డు స్థాయిలో ఆరోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకోని తమ జట్టు బలం ఏంటో మరోసారి నిరూపించింది. ప్రతికూల పరిస్థితుల్లో, తీవ్ర ఒత్తిడిలో విజయాన్ని ఎలా అందుకోవాలో ఆ జట్టుకు బాగా తెలుసు. గత ఏడు టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్స్‌కు చేరిన ఆ జట్టు.. ఆరుసార్లు విజేతగా నిలవడమే అందుకు నిదర్శనం. అయితే ఆ జట్టు ప్రామాణికలు, నైపుణ్యాలు మెరుగవడంలో మహిళల బిగ్‌బాష్ లీగ్‌ది కీలక పాత్ర. 2015-16లో ఈ లీగ్ ప్రారంభమైంది. అయితే అంతకంటే ముందే మూడు సార్లు పొట్టి కప్పును ఆసీస్ అందుకున్నప్పటికీ.. బిగ్ బాష్ లీగ్ తర్వాత ఆటలో మరింత నైపుణ్యాన్ని సాధించింది. అలానే మరోవైపు హండ్రెడ్ లీగ్‌తోనూ ఇంగ్లాండ్ అమ్మాయిలు తమ ఆట స్థాయిని మెరుగుపరుచుకుంటున్నారు.