Why India Lost Against South Africa :2023ను టీమ్ఇండియా ఘోర పరాజయంతో ముగించింది. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టేస్ట్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 131 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(82 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 76) మినహా మిగతా అంతా విఫలమయ్యారు.
Reasons For Team India Loss :మిగతా 9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్నట్లు ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘోర పరాజయం వెనుక కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓ నాలుగు కారణాలు భారత్ పతనాన్ని శాసించాయి.
1. టాస్ ఓడిపోవడం
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం టీమ్ఇండియాకు తీవ్ర నష్టం చేసింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం సౌతాఫ్రికాకు బాగా కలిసొచ్చింది. పేస్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సౌతాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా కగిసో రబడా, నండ్రె బర్గర్ భారత బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చారు.
స్వింగ్ బౌలింగ్‌కు భారత బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న సఫారీ బౌలర్లు భారత బ్యాటర్ల బలహీనతలను టార్గెట్ చేస్తూ వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసుంటే బౌలర్లకు అడ్వాంటేజ్ దొరికేది.
2. ఓపెనర్ల వైఫల్యం
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దారుణంగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయారు. రోహిత్(5, 0), యశస్వీ జైస్వాల్(17, 5) పేలవ ప్రదర్శన కనబర్జారు. వీరి వైఫల్యం తర్వాత బ్యాటర్లపై అనవసర ఒత్తిడి తెచ్చింది. ఈ ఇద్దరిలో ఒక్కరు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం మరోలా ఉండేది.
3.పేలవ బౌలింగ్
సఫారీ జట్టు బౌలర్లు చెలరేగిన పిచ్‌పై భారత బౌలర్లు తడబడ్డారు. మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా రాణించినా ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ నుంచి సహకారం లభించలేదు. ముకేశ్ కుమార్ కాకుండా ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడం టీమ్ఇండియాకు నష్టం చేసింది. మహమ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 300 లోపు ఆలౌట్ చేసినా ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉండేది.
4. టెస్ట్‌లకు తగ్గట్లు ఆడకపోవడం
వన్డే ప్రపంచకప్ తర్వాత మైదానానికి దూరంగా ఉన్న భారత ఆటగాళ్లు టెస్ట్‌లకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఓపికగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. రాహుల్, కోహ్లీ పర్వాలేదనిపించినా వారికి సహకారం లభించలేదు. మరి రెండో టెస్ట్‌లో టీమ్ఇండియా ఏం చేస్తుందో చూడాలి.