దులీప్ ట్రోఫీ-(2003-04) ఫైనల్లో ఈస్ట్‌జోన్ తరఫున ఎంఎస్ ధోనీ(MS Dhoni)తో వికెట్ కీపింగ్ చేయించేందుకు సౌరవ్ గంగూలీని ఒప్పించాల్సి వచ్చిందని బీసీసీఐ మాజీ సెలక్టర్ కిరణ్ మోరె(Kiran More) అన్నారు. దీప్‌దాస్ గుప్తా వికెట్ కీపింగ్ చేయకుండా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఫైనల్లో ఆకట్టుకున్న మహీ ఆ తర్వాత భారత్-ఏ తరఫున పరుగుల వరద పారించాడని తెలిపారు. ఆపై టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడని తెలిపారు.
"అప్పుడు మేం వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోసం చూస్తున్నాం. మొదట నా సహచరుల ద్వారా ధోనీ గురించి విన్నాను. అతడి ఆటను చూసేందుకు వెళ్లాను. జట్టు స్కోరు 170 అయితే అతడే 130 పరుగులు చేయడం వీక్షించాను. అతడు బౌలర్లందరినీ చితకబాదేశాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున అతడిని వికెట్ కీపింగ్ చేయించాలనుకున్నాం. సౌరవ్ గంగూలీ, దీప్‌దాస్ గుప్తాతో తీవ్రంగా చర్చించాం. వారిద్దరూ కోల్‌కతాకు చెందినవారు. టీమ్‌ఇండియాకు ఆడుతున్నారు. దీప్‌దాస్‌ను కీపింగ్ చేయకుండా ఆపేందుకు, గంగూలీని ఒప్పించేందుకు సెలక్టర్లకు కనీసం పది రోజులు పట్టింది."
- కిరణ్ మోరె, టీమ్ఇండియా మాజీ సెలెక్టర్