తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPLకు పంత్‌ దూరం!.. దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌? - David Warner

టీమ్‌ఇండియా ఆటగాడు రిషభ్ పంత్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం చికిత్ప పొందుతున్నాడు. అతడు కోలుకోవడానికి ఆరు నెలలు సమయం పట్టే అవకాశముంది. దీంతో వచ్చే సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Etv warner-has-chance-to-become-the-captain-of-delhi-capitals-due-rishabh-pant-injury
ఐపీఎల్‌కు పంత్‌ దూరం దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌కి అవకాశం

By

Published : Jan 1, 2023, 10:08 PM IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ రిషభ్ పంత్‌ పంత్‌ కోలుకోవడానికి దాదాపు 6 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఫిబ్రవరిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌తో పాటు ఏప్రిల్‌లో మొదలయ్యే ఐపీఎల్‌కు కూడా అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పంత్‌ ఐపీఎల్‌కు దూరమైతే దిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారనే చర్చ మొదలైంది. ప్రస్తుతం దిల్లీ జట్టులో డేవిడ్‌ వార్నర్‌, పృథ్వీ షా, మనీశ్‌ పాండే, మిచెల్ మార్ష్‌లకు కెప్టెన్సీ అనుభవం ఉంది. అయితే, వీరిలో వార్నర్‌ వైపే దిల్లీ యాజమాన్యం మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఎందుకంటే ఐపీఎల్‌లో వార్నర్‌కు ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవముంది. సన్‌రైజర్స్‌కు కొన్ని సీజన్ల పాటు నాయకత్వం వహించాడు. వార్నర్‌ కెప్టెన్సీలోనే 2016లో సన్‌రైజర్స్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ప్రస్తుతం పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీ యాజమాన్యం ఫోకస్‌ పెట్టింది. ఐపీఎల్‌ ప్రారంభమయ్యే నాటికి పంత్‌ పూర్తిగా కోలుకోకపోతే వార్నర్‌ను కెప్టెన్‌గా ప్రకటించే అవకాశముంది. ఇక, వార్నర్‌ ఐపీఎల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. 162 మ్యాచ్‌లు ఆడి 5,881 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 55 అర్ధ సెంచరీలున్నాయి.

ప్రస్తుతం రిషభ్‌ పంత్‌ దెహ్రాదూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్నాడు. పంత్‌ ముఖం మీద అయిన గాయాలకు శనివారం వైద్యులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. రిషభ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని దిల్లీ క్రికెట్‌ సంఘం డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details