ఒకరేమో ఆల్‌టైమ్, ఆల్ ఫార్మాట్ గ్రేట్ బ్యాట్స్‌మన్. టీ20ల్లో పదివేలకు పైగా పరుగులు సాధించిన ఐదుగురు ఆటగాళ్ల జాబితాలో ఒకడిగా నిలిచాడు. మరొకరేమో.. దాదాపు ఇదే పేరును అందుకునే క్రమంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆరు వేలకు పైగా రన్స్ చేశాడు. వీరిద్దరూ టాప్ ఆర్డర్ బ్యాటర్స్, ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకరు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీరు చదువుతున్నది ఎవరి గురించో. వారే టీమ్ఇండియా సారథి కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్. మరికొద్ది గంటల్లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఆరభం కానుంది. ఈ రసవత్తర పోరు కోసం కోట్ల మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇరు జట్ల సారథుల రికార్డులపై ఓ లుక్కేద్దాం..
కోహ్లీ రికార్డ్స్(kohli t20 captaincy stats)
భారత్ నుంచి ఒక్కడే..
టీ20ల్లో పదివేలకుపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు కోహ్లీ. ఈ జాబితాలో క్రిస్‌గేల్(14,276), కీరన్ పొలార్డ్(11,236), షోయబ్ మాలిక్(11,033), కోహ్లీ(10,136), వార్నర్(10,019). భారత్ తరఫున ఈ ఫీట్‌ను అందుకున్న తొలి ఆటగాడు ఇతడే కావడం విశేషం. ఇప్పటికీ ఈ లిస్ట్‌లో విరాట్ మాత్రమే టీమ్ఇండియా నుంచి ఉన్నాడు.
అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు(kohli t20 runs overall)
గత పదేళ్లలో 90 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 139.04స్ట్రైక్‌రేట్‌తో 3,159 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో మూడు వేల పరుగులు సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత మార్టిన్ గప్టిల్(2,939), రోహిత్‌శర్మ(2,864) ఉన్నారు. టీ20ల్లో 50కిపైగా సగటు ఉన్నది ఇతడొక్కడికే.
50ప్లస్ స్కోరు(virat kohli half centuries in t20)
టీ20ల్లో అత్యధిక(28) హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే శతకాలు మాత్రం బాదలేదు. రోహిత్‌శర్మ ఇప్పటివరకు 22 హాఫ్ సెంచరీలు, నాలుగు శతకాలు బాదాడు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు(virat kohli t20 world cup runs)
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు కోహ్లీ. 16మ్యాచ్‌ల్లో 86.33 సగటుతో 777 రన్స్ చేశాడు. ఇందులో 9 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లలో మహేలా జయవర్దనె(1,016), క్రిస్‌గేల్(920), దిల్షన్(897) రన్స్‌తో కొనసాగుతున్నారు.