Virat Kohli Stats : ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఉత్తమ బ్యాటర్లుగా పేర్కొనే ఎవరి గణాంకాలైనా పరిశీలించండి. మొదట బ్యాటింగ్ చేస్తున్నపుడు ఎవరైనా సరే ఎక్కువ పరుగులు చేసి ఉంటారు. వారి సగటు రేట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ సమయాల్లోనే రికార్డు స్థాయిలో సెంచరీలు, హాఫ్ సెంచరీలు సాధించి ఉంటారు. అయితే ప్రత్యర్థులు నిర్దేశించే లక్ష్యాలను ఛేదిస్తున్నపుడు అటుంవంటి గణాంకాలు ఒక్కసారిగా నెమ్మదిస్తాయి. అంటే ఆశించిన స్థాయిలో లెక్కలు ఉండవు అన్నమాట. రన్స్, యావరేజ్, స్ట్రైక్ రేట్, శతకాలు, అర్ధశతకాలు ఇలా ఏదైనా సరే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటితో పోలిస్తే గణనీయంగా అవి క్రమంగా తగ్గుతూ వస్తాయి. అయితే ఈ ఫార్ములా మాత్రం కింగ్ విరాట్ కోహ్లీ విషయంలో అస్సలు వర్తించదు. ఎందుకంటే మిగతా బ్యాటర్లందరితో పోలిస్తే అతను పూర్తి భిన్నంగా ఆడతాడు. టార్గెట్ ఛేదిస్తున్నప్పుడే అతడి పరుగుల ప్రవాహంలో జోరు కనిపిస్తుంటుంది. సగటు, సెంచరీలు, మెరుగైన స్ట్రైక్ రేట్.. ఇలా అన్ని అంశాల్లోనూ అతడు అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తాడు. అతడిలోని ఈ వైవిధ్యమే అతణ్ని గొప్ప బ్యాటర్‌గా నిలబెడుతూ వస్తోంది.
వన్డేల్లో కోహ్లీ గణాంకాలు ఇలా..
- 282 వన్డేల్లో 57.50 సగటుతో 13,168 పరుగులు సాధించాడు. ఇందులో 47 శతకాలు ఉన్నాయి.
- మొదట బ్యాటింగ్ చేస్తున్నపుడు 50.38 సగటుతో 5643 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి.
- ఇక లక్ష్యాలను ఛేదిస్తున్నపుడు విరాట్ 64.31 సగటుతో ఏకంగా 7525 పరుగులు చేయడం విశేషం. ఇందులో సరాసరి 26 శతకాలున్నాయి.
ఆ ఇన్నింగ్స్‌ను మరువగలమా?
2012లో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ సందర్భంగా జట్టు ఫైనల్ చేరాలంటే శ్రీలంకపై 40 ఓవర్లలోనే 320 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. అలాంటి సమయంలో కేవలం 86 బంతుల సాయంతో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొత్తం 36.4 ఓవర్లలోనే జట్టును గెలిపించాడు. ఇలా కోహ్లీని లక్ష్యఛేదనలో మొనగాడిగా నిలిపిన ఇన్నింగ్స్‌లు అనేకం. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లి ఆడిన సంచలన ఇన్నింగ్స్‌ను సగటు క్రికెట్ అభిమాని అంత త్వరగా మరిచిపోలేడు. ఇక తాజాగా వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 200 పరుగుల స్వల్ప టార్గెట్‌లో 2 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో.. మరో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో కలిసి అద్భుతంగా పోరాడాడు. 85 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.