Kohli Dravid: దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి పలు సూచనలు చేస్తూ కనిపించాడు. ఆ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.
కోహ్లీకి ద్రవిడ్ పాఠాలు.. ఫామ్‌లోకి రావడమే లక్ష్యంగా!
Kohli Dravid: కొంతకాలంగా సరైన ఫామ్‌లో కనిపించట్లేదు టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. దీంతో ఎలాగైనా దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించాలని చూస్తున్నాడు. అందుకోసం కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర మెళకువలు నేర్చుకుంటూ కనిపించాడు కోహ్లీ.
కొద్ది కాలంగా విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. కోహ్లీ ఆడిన గత 13 టెస్టుల్లో 26 సగటుతో పరుగులు చేశాడు. అత్తుత్తమ స్కోరు 74. అయినా టెస్టుల్లో కోహ్లీ 50కి పైగా సగటుతో కొనసాగుతుండటం విశేషం. చివరి సారిగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. దీంతో విదేశీ పిచ్‌లపై సమర్థంగా రాణించేందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి పలు సూచనలు సలహాలు తీసుకున్నాడు కోహ్లీ.
సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు సంబంధించి కోహ్లీపై మరింత భారం పడినట్లయింది. మరోవైపు బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ తదితరులు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. సెంచూరియన్ వేదికగా డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.