Virat Kohli 76th Century : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. విండీస్‌తో జరుగుతున్న టెస్టులో ఓవర్‌నైట్ స్కోరు 87 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీ.. కెరీర్లో 76వ శతకాన్ని అందుకున్నాడు. ఇది కోహ్లీకి టెస్టుల్లో 29వ సెంచరీ కాగా.. వెస్టిండీస్‌పై అతడికి ఇది మూడో శతకం. అయితే ఇప్పటికే అత్యధిక టెస్టు పరుగుల్లో భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించిన విరాట్.. ఇప్పుడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ (8,643)ను కూడా దాటేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 49.30 సగటుతో 8,655 పరుగులతో కొనసాగుతున్నాడు.
ఈ సెంచరీతో విరాట్ మరో ఘనత అందుకున్నాడు. సెంచరీల జాబితాలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ (28), మైకెల్ క్లార్క్ (28), హషీమ్ ఆమ్లా (28)ను వెనక్కినెట్టి విరాట్.. క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ (29) ను సమం చేశాడు. ఆయితే బ్రాడ్‌మన్ కేవలం 52 టెస్టుల్లోనే 29 సెంచరీలు బాదగా.. విరాట్ మాత్రం ఆ మార్క్‌ను అందుకునేందుకు 111 టెస్టులు తీసుకున్నాడు. ఇక విరాట్ మొత్తంగా 25,582 అంతర్జాతీయ పరుగులతో సచిన్ తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు.