తెలంగాణ

telangana

ETV Bharat / sports

Under-19 Worldcup Semifinal: నేడే ఆసీస్‌తో భారత్‌ సమరం - అండర్​ 19 ప్రపంచకప్​ సమీఫైనల్​

Under-19 Worldcup: అండర్​-19 ప్రపంచకప్​లో భాగంగా నేడు జరగబోయే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది టీమ్​ఇండియా. ఈ మ్యాచ్​లో ఇరు జట్లు గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తారో. నేడే ఆసీస్‌తో భారత్‌ సమరం

Under-19 Worldcup
Under-19 Worldcup

By

Published : Feb 2, 2022, 6:44 AM IST

Under-19 Worldcup: కుర్రాళ్లకు సవాల్‌! అండర్‌-19 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టుకు తొలిసారి కఠిన పరీక్ష ఎదురు కాబోతోంది. బుధవారం జరిగే సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాతో యవ భారత్‌ ఢీకొంటుంది. క్వార్టర్‌ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బంగ్లాదేశ్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయాన్ని అందుకున్న టీమ్‌ఇండియా.. సెమీస్‌లోనూ ఇదే జోరు ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది. కరోనా నుంచి కోలుకుని కీలక ఆటగాళ్లు జట్టులోకి చేరడం భారత్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బంగ్లాతో పోరులో అది స్పష్టంగా కనిపించింది. అయితే రెండుసార్లు ఛాంపియన్‌ ఆసీస్‌ను ఓడించడం మన జట్టుకు అంత తేలికేం కాదు. కానీ ఫామ్‌లో ఉన్న రఘువంశీ, రషీద్‌, రవికుమార్‌, విక్కీ, రాజ్‌ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు.

ముఖ్యంగా బంగ్లాపై విజృంభించిన లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ రవికుమార్‌ సత్తా చాటాలని టీమ్‌ఇండియా కోరుకుంటోంది. బంగ్లాతో మ్యాచ్‌లో మన జట్టు బ్యాటింగ్‌లో అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది. అంతేకాదు స్వల్ప ఛేదనలో అనవసరమైన షాట్లతో భారత బ్యాట్స్‌మెన్‌ వికెట్లు చేజార్చుకున్నారు. ఈ విషయాల్లో భారత్‌ మెరుగుపడాల్సి ఉంది. అంతేకాదు ఆసీస్‌ను అడ్డుకోవాలంటే స్టార్‌ ఓపెనర్‌ టీగ్‌ విల్లీ.. బౌలర్లు టామ్‌ విట్నీ, విలియమ్‌, స్లాజ్‌మన్‌లను నిలువరించడం కీలకం. ముఖ్యంగా 17 ఏళ్ల టీగ్‌ విల్లీ తన అటాకింగ్‌ బ్యాటింగ్‌తో ఆరంభంలోనే విరుచుకుపడుతున్నాడు. అతడిని స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేర్చగలిగితే ప్రత్యర్థిని దెబ్బ కొట్టొచ్చు. వార్మప్‌ మ్యాచ్‌లో కంగారూలను ఓడించడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.. కరోనా బారిన పడిన నిశాంత్‌ సిద్ధూ కోలుకుని సెమీస్‌కు అందుబాటులో ఉండడం సానుకూలాంశం. ఈ టోర్నమెంట్లో టీమ్‌ఇండియాకు ప్రత్యర్థుల కన్నా కరోనానే ఎక్కువ భయపెట్టింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ యశ్‌ ధూల్‌తో పాటు, వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌, ఆరాధ్య యాదవ్‌, మానవ్‌ పరేఖ్‌, సిద్ధార్థ్‌ యాదవ్‌లు పాజిటివ్‌గా తేలారు. రిజర్వ్‌ ఆటగాళ్లతోనే ఐర్లాండ్‌, ఉగాండాపై ఘన విజయాలు సాధించి భారత్‌ నాకౌట్లో అడుగుపెట్టింది.

ABOUT THE AUTHOR

...view details