ముంబయి వేదికగా లంకతో జరిగిన మొదటి టీ20లో టీమ్ఇండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా పలు రికార్డులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును కొల్లగొట్టిన యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడు అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ రికార్డును తిరగరాస్తానని సంకల్పించుకున్న ఈ యంగ్ ప్లేయర్ ఆ లక్ష్యంగానే దుసుకెళ్తున్నాడు.
ఈ స్పీడ్‌తో బాల్ వేస్తే ఇక అంతే సంగతి!.. లక్ష్యం వైపు దూసుకెళ్తున్న టీమ్ఇండియా యంగ్ పేసర్..
'వంద మైళ్ల వేగంతో బంతులు వేస్తా.. అక్తర్ రికార్డును బద్దలు కొట్టేస్తా'.. ఇవి ప్రాక్టీస్ మ్యాచ్‌లో యంగ్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ చెప్పిన మాటలు. ఇప్పుడు తను అదే దిశగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం లంకతో జరిగిన తొలి టీ20లో అతడి బౌలింగ్ చూసిన అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
మంగళవారం జరిగిన హోరా హోరీ మ్యాచ్‌లో గంటకు సుమారు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మ్యాచ్‌లో ఓ ట్విస్ట్ తీసుకొచ్చాడు. రెండు వికెట్లు తీసి 27 పరుగులు ఇచ్చాడు. ఉమ్రాన్ చేసిన ఈ అద్భుతమైన ఫీట్ ద్వారా భారత పేసర్లలో ఇప్పటి వరకు అత్యధిక వేగంతో బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించాడు. బుమ్రా అత్యధిక వేగం గంటకు 153.36 కి.మీ. వేగంతో టాప్‌లో ఉండగా.. మహమ్మద్ షమీ (153.3 కిలోమీటర్లు), నవ్‌దీప్ సైనీ గంటకు 152.85 కిలోమీటర్ల వేగంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. తాజాగా ఈ ముగ్గుర్ని వెనక్కు నెట్టి ప్రస్తుతం టాప్ బౌలర్ల జాబితాలో ఉమ్రాన్ టాప్‌లో ఉన్నాడు. ఇతను వేగంగా బౌలింగ్ చేయడమే కాకుండా తన లైన్ లెంగ్త్‌ను కూడా చాలా మెరుగుపరుచుకున్నాడు.