క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) పరిపాలన సంక్షోభంలో ప్రస్తుతానికి తమ జోక్యం ఉండదని ఐసీసీ స్పష్టంచేసింది. ప్రభుత్వ జోక్యంతో సీఎస్‌ఏపై ఐసీసీ నిషేధం విధిస్తే భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పాల్గొనలేదంటూ ముగ్గురు సారథులు డీన్ ఎల్గర్, తెంబా బవుమా, డేన్ వాన్ నీకెర్క్‌లు సంయుక్త ప్రకటనలో ఆందోళన వ్యక్తంజేశారు. ఈనేపథ్యంలో మంగళవారం ఐసీసీ ప్రకటన దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ఉపశమనం కలిగించింది.
సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో కలిసి పనిచేసేలా సభ్యుల్ని ఐసీసీ ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ జోక్యం అన్ని సార్లు సమస్యాత్మకం కాబోదు. ఐసీసీ జోక్యం చేసుకోవాలంటే సభ్య దేశం నుంచి అధికారికంగా ఫిర్యాదు అవసరం. అదే జరిగితే వాస్తవాల ఆధారంగా పరిస్థితిని అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటాం అని ఐసీసీ పేర్కొంది.