WTC 2023 Rohit Captaincy : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు ఆటలో భారత్‌పై ఆస్ట్రేలియా పైచేయి సాధించడానికి ఫీల్డింగ్ కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచింది. తొలి సెషన్‌లో మాత్రం మన బౌలర్లు ఆధిక్యత ప్రదర్శించారు. కానీ, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడటం వల్ల భారత ఆటగాళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. అంతే కాకుండా ఫీల్డింగ్ మోహరింపు కూడా ఏమాత్రం బాగోలేదనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లతో పాటు మాజీలు ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆసీస్ బ్యాటర్లు సునాయాసంగా పరుగులు సాధించినప్పటికీ.. ఫీల్డింగ్ కూర్పు బాగాలేదని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అనగా.. తుది జట్టు ఎంపికపైన బాలీవుడ్ నటుడు హర్ష్‌వర్థన్ కపూర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతోంది.
"టీమ్‌ఇండియా తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఆసీస్ 76/3 స్కోరుతో ఉన్న సమయంలో పైచేయి సాధించాల్సింది. అక్కడ మాత్రం టీమ్‌ఇండియా చేతులెత్తేసింది. ప్రత్యర్థి బ్యాటర్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లంచ్ బ్రేక్ తర్వాత రెండో ఓవర్‌లోనే వికెట్ సాధించిన భారత్ అనంతరం క్రమక్రమంగా తన లయను కోల్పోయింది. ట్రావిస్ హెడ్ ఈజీగా పరుగులు సాధించేలా మన ఫీల్డింగ్ ఉంది. దీంతో అతడు అలవోకగా హుక్ షాట్లు కొట్టాడు. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలుసు. మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. కానీ, కీలకమైన ఫైనల్‌లో 76/3 స్కోరు ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన హెడ్.. సులువుగా పరుగులు రాబట్టాడు. అతడు అలా చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్ సరిగా లేకపోవడమే కారణం" అని మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.
టీమ్ సెలెక్షన్ దారుణం: బాలీవుడ్ నటుడు
టీమ్ సెలెక్షన్ విషయంపై బాలీవుడ్ నటుడు హర్షవర్దన్ కపూర్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. "డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ సారథిగా లేకపోవడం తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించింది. అతడు కెప్టెన్‌గా ఉన్నప్పుడు కనిపించిన దూకుడు ఇప్పుడు లేదు. రోహిత్ నాయకత్వంలో అది కనిపించడం లేదు. తుది జట్టు ఎంపిక కూడా దారుణంగా ఉంది. ఈ టీమ్‌లో అశ్విన్ లేకపోవడం సరైంది కాదు. అలాగే, గాయం కారణంగా బుమ్రా దూరం కావడం కూడా జట్టుకు భారీ నష్టమే" అని హర్ష్ వర్థన్ ట్వీట్ చేశాడు.
WTC Final Winner : డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత.. 'ఏఐ' ఏం చెప్పిందంటే..?
Harshavardhan Kapoor Tweet : ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విజేత ఎవరనే అంశం ఇప్పుడు నెట్టింట అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. కేవలం తొలి రోజు ఆట మాత్రమే ముగిసింది. అయినా, ప్రారంభం నుంచే ఏ జట్టు గెలుస్తుందనే అంశంపై సర్వత్ర చర్చలు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాజాగా వెల్లడించింది. ఆ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది.
"మేం డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత గురించి ఏఐను అడిగాం. ఆ రిజల్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అదేంటో మీరూ చూసేయండి’"అని క్రికెట్ ఆస్ట్రేలియా ఆ వీడియోను అప్లోడ్ చేసింది. ఇక ఆ ఏఐ ఫలితాలను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్ చదివి వినిపించారు. మరి 'ఏఐ' ఈ విషయంలో ఏం చెప్పిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం..
- AI about WTC Final : "ఆస్ట్రేలియా, భారత్ ఉత్కంఠభరితంగా పోరాడతాయి. అయితే, ఆసీస్ తన ముందున్న భారీ టార్గెట్‌ను ఛేదించి విజేతగా నిలుస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ రివర్స్ అవుతుంది. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది" - ప్యాట్ కమిన్స్
- "నాథన్ లైయన్, జోష్ హేజిల్‌వుడ్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. హేజిల్ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడతాడు. ఛేదనను మరింత సులువు చేస్తాడు. ఇక భారత బౌలర్లు మాత్రం తమ రిథమ్‌ను అందిపుచ్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు" - హేజిల్‌వుడ్
- "ప్యాట్ కమిన్స్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. దూకుడైన ఆటతీరుతో ఆసీస్ శిబిరంలో భరోసాను కల్పిస్తాడు. ప్రతి షాట్‌తో మ్యాచ్‌ను దగ్గరగా తీసుకొస్తాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సందర్భంలో.. భారత బౌలర్ వేసిన ఫుల్‌టాస్‌ను ఆకాశమే హద్దుగా బాదేస్తాడు" - కమిన్స్
- "ఓవల్ మైదానం అదిరిపోయింది" - నాథన్ లైయన్
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అభిమానులు సైతం వీరు చదివినవన్నీ నిజంగా జరుగుతాయా లేదా అని ఎదురు చూస్తున్నారు. మరి రెండో రోజు ఏం జరుగుతుందో వేచి చూడాలని అంటున్నారు.