నాలుగేళ్ల తర్వాత భారత జట్టు తరఫున పొట్టి ఫార్మాట్‌లో క్రికెట్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్(Ravi Ashwin News) తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) తొలి రెండు మ్యాచ్‌లకు తనను పక్కన పెట్టడం ఎంత పొరపాటో టీమ్‌ఇండియా యాజమాన్యానికి తెలిసొచ్చేలా చేశాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అశ్విన్ (4-0-14-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గుల్బాడిన్ నైబ్, జద్రాన్ వంటి కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. శుక్రవారం స్కాట్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా అశ్విన్ ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు.
"జీవితం చక్రంలాంటిదని నమ్ముతుంటా. కొందరికి చిన్నది.. మరికొందరికి పెద్దది. చీకటి దశను దాటే వరకు ఓపికగా ఉండలి. రెండేళ్లుగా జీవిత గమనం ఎలా ఉంటుందో గమనిస్తూ వచ్చాను. నేను మంచి ఫామ్‌లో ఉన్నా లేకపోయినా నాకంటూ కొన్ని బంధనాలను ఏర్పరచుకున్నా. సుదీర్ఘకాలం నిశ్చలంగా గడిపేందుకు ప్రయత్నించా. వైఫల్యాలు ఎందుకు వచ్చాయనే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. విజయవంతమైన సమయాల్లో వినయంగా ఉండాలని చాలా మంది చెబుతుంటారు. అయితే దానిని నేను గట్టిగా స్వీకరించి ఆచరించాను"
-రవిచంద్రన్ అశ్విన్, టీమ్‌ఇండియా స్పిన్నర్.