సౌథాంప్టన్ వేదికగా కివీస్‌తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీ సమయానికి టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కోహ్లీ(94 బంతుల్లో 35 పరుగులు), రహానె(54 బంతుల్లో 13 పరుగులు) ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, వాగ్నర్, బౌల్ట్ తలో వికెట్ తీసుకున్నారు.
68/2తో లంచ్‌కు వెళ్లిన భారత్ రెండో సెషన్లో పుజారా వికెట్‌ను కోల్పోయింది. అద్భుతమైన బంతితో నయా వాల్‌ను బోల్తా కొట్టించాడు ట్రెంట్ బౌల్ట్. ఆ తర్వాత ఆచితూచి ఆడింది కోహ్లీ-రహానె జంట. సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డుకు ఒక్కో పరుగు జోడించారు. నాలుగో వికెట్‌కు ఈ ద్వయం 32 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. టీ విరామానికి ముందు మరో వికెట్ పడకుండా వీరిద్దరు జాగ్రత్త పడ్డారు.
శుభారంభం..
వర్షం కారణంగా తొలి రోజు తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన శుభారంభం చేసింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(68 బంతుల్లో 34), శుభ్‌మన్ గిల్(64 బంతుల్లో 28).. 62 పరుగులు జోడించారు. కుదురుకుంటున్నట్టే కనిపించిన ఈ జంటను జేమీసన్ విడగొట్టాడు. రోహిత్‌ను స్లిప్‌లో దొరకబుచ్చుకున్నాడు. గిల్ కూడా వికెట్‌కీపర్‌కు చిక్కాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది టీమ్ఇండియా.