టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ(53) తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే ఈ అర్ధశతకాన్ని మరీ కష్టంగా బాదాదు. మ్యాచ్ అనంతంర దీని గురించి స్పందించాడు. ఈ హాఫ్ సెంచరీ మరీ ఎక్కువ ఆనందమేమీ ఇవ్వలేదని పేర్కొన్నాడు.
"టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే ప్రత్యేకమైన విజయం సాధించిన తర్వాత సిడ్నీకి వచ్చాం. మూడు రోజుల తర్వాత మళ్లీ గేమ్‌పై దృష్టిసారించాం. ప్రతి పాయింటూ కీలకమైన సమయంలో మ్యాచ్‌ను గెలిచి రెండుపాయింట్లను ఖాతాలో వేసుకోవడం ఆనందంగా ఉంది. సూపర్ -12లోకి దూసుకొచ్చిన నెదర్లాండ్స్‌ను తక్కువగా అంచనా వేయలేదు. ప్రత్యర్థిని పట్టించుకోకుండా మా ఆటను ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తాం. అయితే ఆరంభంలో చాలా నెమ్మదిగా ఆడాం. భారీ షాట్లు ఆడేందుకు తగ్గట్లుగా పిచ్ మారే వరకు వేచి ఉండాలని నేను, విరాట్ మాట్లాడుకొన్నాం. హాఫ్ సెంచరీతో నాకు పెద్దగా సంతోషం ఏమీ లేదు. అయితే పరుగులు రాబట్టడమే కీలకం. ఇందులో మంచి పరుగులు.. చెడు పరుగులు అనేవి ఉండవు. చివరికి ఎన్ని సాధించామన్నదే ఆత్మవిశ్వాసం పెరిగేందుకు సాయపడుతుంది" అని అన్నాడు.