టీ20 ప్రపంచకప్‌లో వరుసగా విఫలమైన దినేశ్ కార్తిక్‌కు బదులు.. సూపర్ -12 చివరి మ్యాచ్ అయిన జింబాబ్వేతో పోరుకు రిషభ్ పంత్‌ను టీమ్‌ఇండియా ఆడించింది. అయితే కేవలం 3 పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. అయినప్పటికీ భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో పంత్ ఆటతీరుపై విమర్శలు రావడంతో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. అంతేకాకుండా సెమీస్ పోరుకు సంబంధించిన విషయాలపైనా మాట్లాడాడు. ‘కేవలం ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి అవసరం లేదు. అభిమానులు కూడా ఇలా అంచనాకు వస్తారని అనుకోవడం లేదు. ఒక్కోసారి మ్యాచ్ పరిస్థితికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది" అని పేర్కొన్నాడు.
సెమీస్ పోరుపై.. "జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ను సెమీ ఫైనల్‌కు రిహార్సల్‌గా మాత్రమే పరిగణించాం. టాస్ నెగ్గినప్పుడు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం కూడా అందులో భాగమే. ప్రతి మ్యాచ్‌లో టాస్ గెలవడం కూడా చాలా కీలకం. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోవాలని ముందు అనుకొన్నాం. ఇప్పుడు జింబాబ్వేపైనా మొదట బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందని పరిశీలించాం. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఇప్పుడే చెప్పలేను. అయితే 15 మందిలో ప్రతి ఒక్కరిపై మాకు నమ్మకం ఉంది. అత్యుత్తమ స్క్వాడ్‌తోనే ఇక్కడికి వచ్చాం. అడిలైడ్‌లో స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని పాకిస్థాన్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌తో తెలిసింది. తాజాగా నేను కూడా పిచ్‌ను పరిశీలించా. నెమ్మదిగా ఉండి బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతకుముందు ఇక్కడే బంగ్లాదేశ్‌తో ఆడిన పిచ్ స్పిన్నర్లకు పెద్దగా సహకరించలేదు. అయితే కొత్త పిచ్ మాత్రం టర్నింగ్‌కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. మ్యాచ్ సమయానికి పిచ్‌కు తగ్గట్లుగా తుది జట్టును ఎంచుకొంటాం" అని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.