కరోనా కారణంగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరిగే వీలు లేనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం ఐసీసీని గడువు కోరింది బీసీసీఐ. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మెగా టోర్నీని యూఏఈలో జరిపేందుకు భారత క్రికెట్ బోర్డు మొగ్గుచూపుతోందట. ఈ విషయంపై ఐసీసీకి సమాచారం కూడా ఇచ్చిందని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది. మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ టోర్నీలోని మ్యాచ్‌లు అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
అదే కారణం
టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ అనుకున్నా రెండు కారణాలు బోర్డుకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ మెగాటోర్నీకి భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోవడం మొదటిది కాగా, కరోనా కారణంగా ఐపీఎల్ రద్దయిన పరిస్థితుల్లో 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు భారత్‌కు వస్తారా? అన్న ప్రశ్న రెండోది.
వారం క్రితం రాష్ట్రాల క్రికెట్ బోర్డులతో జరిగిన వర్చువల్ సమావేశంలోనూ ఇదే విషయంపై చర్చించింది బోర్డు. ఇందులో భాగంగా మెగాటోర్నీని యూఏఈ వేదికగా జరపబోతున్నట్లు వారికి సమాచారం ఇచ్చింది. దీని ద్వారా బోర్డుకు 41 శాతం ఆర్థిక లాభం చేకూరనుంది. ఒకవేళ భారత్‌లో ఈ టోర్నీ జరిపితే ప్రభుత్వానికి భారీగా పన్ను కట్టాల్సి వచ్చేది. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన పన్ను మినహాయింపు ఇప్పటివరకు లభించకపోవడం గమనార్హం.