టీమ్ఇండియా యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ దూసుకుపోతున్నాడు. మైదానంలో తనదైన శైలిలో అదిరిపోయే షాట్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఫ్యాన్స్ షాక్ అయ్యే ప్రదర్శన చేస్తున్నాడు. అయితే అతడు జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం, ఈ స్థాయికి ఎదగడం వెనక ఎంతో కష్టం దాగి ఉంది. దాదాపు ఫస్ట్‌క్లాస్ కెరీర్ మొదలుపెట్టిన 11 ఏళ్లకు అతడికి జాతీయ జట్టులో స్థానం లభించింది. తాజాగా ఈ విషయాన్నే అతడు గుర్తుచేసుకున్నాడు. ఎంత కష్టించినా నేషనల్ టీమ్‌కు ఎంపిక కాకపోవడంపై ఒక దశలో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపాడు. టీమ్‌లోకి అడుగుపెట్టడానికి తాను అనుసరించిన వ్యూహాన్ని వివరించాడు. తన సూపర్ షాట్ల వెనుక ఉన్న రహస్యాన్ని కూడా చెప్పాడు.
తీవ్ర నిరాశకు.. మొదట్లో ఎంతో శ్రమించినా టీమ్ఇండియాకు సెలెక్ట్ కాకపోవడంపై మాట్లాడుతూ.. "2017-18లో నేను, నా భార్య దేవిషా కలిసి ఓ నిర్ణయం తీసుకొన్నాం. ఇక నుంచి హార్డ్ వర్క్ మానేసి.. స్మార్ట్ వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాం.కొంచెం భిన్నంగా ప్రయత్నించాలని ఫిక్స్ అయ్యాం. ఫలితం ఏం వస్తుందో చూద్దామని అనుకున్నాం. దీంతో నా ట్రైనింగ్‌ను డిఫరెంట్‌గా ప్రారంభించాను. 2018 తర్వాత నేను ఏం చేయాలో తెలిసొచ్చింది. ఆఫ్‌సైడ్ ఎక్కువగా దృష్టిపెట్టాను. దీంతో పాటు డైటింగ్ మొదలుపెట్టాను. నేను చేసిన చిన్నచిన్న పనులే.. 2018, 19 దేశవాళీ సీజన్‌లో బాగా ఉపయోగపడ్డాయి. 2020 నాటికి నా శరీరం పూర్తిగా మారిపోయింది"
"నా శరీరం దేనికి అలవాటుపడింది? నాకు ఏది సహాయపడుతుంది? ఎలా ముందుకు వెళ్లాలి? అనేది అర్థం చేసుకోవడానికి ఏడాదిన్నర పట్టింది. క్రమంగా వాటన్నింటినీ గ్రహించి సరైన దిశలో ప్రయాణం మొదలుపెట్టాను. నాటి నుంచి ప్రతీది వాటంతట అవే జరిగిపోయాయి. నేనేం చేయాలి? నా సాధన ఎంతమేరకు ఉండాలి? అనే విషయాలు అర్థమయ్యాయి. గతంలో నేను మొద్దుగా సాధన చేసేవాడిని. కొన్ని సార్లు అసహనానికి గురయ్యేవాడిని. ఆ ప్రాక్టీస్‌లో నాణ్యత లేదని తెలుసుకున్నా. 2018 తర్వాత నాణ్యమైన శిక్షణ, డైట్, నెట్‌సెషన్స్ లభించాయి. ఇవన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయి. పూర్తిగా సిద్ధమయ్యాక లీగ్ సహా ఫార్మాట్లలో బాగా పరుగులు చేశా. దీంతోపాటు ఆటలో నిలకడ వచ్చింది." అని వివరించాడు.