భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో, మూడో టెస్టు జరుగుతున్న సమయంలో మైదానంలోకి వచ్చి నవ్వులు పూయించిన జర్వో(ఇంగ్లాండ్) అనే అభిమానిని క్రికెట్ అభిమానులు మర్చిపోయి ఉండరు. ఎందుకంటే ఓవైపు మ్యాచ్‌లు ఉత్కంఠ రేపుతుంటే.. మరోవైపు అతడు గ్రౌండ్లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. భారత జెర్సీని ధరించి బ్యాటింగ్‌కు దిగడం, భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించడం వంటివి చేశాడు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
అయితే ఇప్పుడు భద్రత ఉల్లంఘన కింద జర్వోపై జీవితకాల నిషేధం విధించింది మూడో టెస్టు వేదికైనా హెడింగ్లే స్టేడియం యాజమాన్యం. ఇకపై ఎప్పుడూ ఆ మైదానానికి అతడు రాకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది. జరిమానా కూడా విధించింది. ఈ విషయాన్ని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.
ఏం చేశాడు?
లార్డ్స్‌లో రెండో టెస్టు ఆడుతున్నప్పుడు టీమ్‌ఇండియా జెర్సీ ధరించి జర్వో మైదానంలో అడుగుపెట్టాడు. సాధారణ ఫీల్డర్లా ప్రవర్తించాడు. అక్కడికి వెళ్లు.. దూరంగా నిలబడు.. అంటూ సైగలు చేసి ఫీల్డింగ్ సెట్ చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ నిజంగానే అతడిని ఆటగాడిగా భావించారు. ఆ తర్వాత నిజం తెలిసిన అభిమానులు మాత్రం స్టాండ్స్‌లో ముసిముసిగా నవ్వుకున్నారు. చివరికి అతడు ప్రాంక్‌స్టర్ అని తెలియడం వల్ల జడ్డూ, సిరాజ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక మైదానం సిబ్బంది అతడిని బయటకు తీసుకువెళ్లడానికి ఆపసోపాలు పడ్డారు.
మూడో టెస్టులోనూ జర్వో మళ్లీ మైదానంలోకి రావడం కలకలం సృష్టించింది. 'జర్వో 69' అనే పేరుతో టీమ్‌ఇండియా జెర్సీని ధరించి అతడు మైదానంలోకి వచ్చాడు. మూడో రోజు ఆటలో రోహిత్‌శర్మ ఔటైన తర్వాత అతడు బ్యాటు పట్టుకొని, హెల్మెట్ ధరించి మైదానంలోకి నడిచాడు. అయితే అతడి ముఖానికి సర్జికల్ మాస్క్ ఉండటం వల్ల గుర్తించిన సిబ్బంది వెంటనే అతడిని బయటకు తీసుకెళ్లారు. జర్వో ఇలా చేయడం వల్ల క్రికెటర్ల భద్రత ప్రశ్నార్థకంగా మారిందంటూ పలువురు విమర్శించారు. అయితే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అతడు మైదానంలోకి ఎలా అడుగు పెడుతున్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు!
ఇదీ చూడండి: బ్యాటింగ్‌కు దిగిన ఫ్యాన్.. మైదానంలో ఫుల్ కామెడీ!