SL vs NED World Cup 2023 :2023 ప్రపంచకప్‌లో శ్రీలంక ఎట్టకేలకు బోణీకొట్టింది. శనివారం లఖ్‌నవూ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 263 పరుగుల లక్ష్య ఛేదనలో దిగిన లంక.. 5 వికెట్లు కోల్పోయి ఓవర్లలో విజయాన్ని అందుకుంది. లంక బ్యాటర్లలో సదీర సమరవిక్రమ (91*) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ పాతుమ్ నిస్సంకా (54), చరిత్ అసలంక (44), ధనంజయ డి సిల్వా (30) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ 3, పౌల్ వాన్, కొలిన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సదీర సమరవిక్రమకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
263 పరుగుల లక్ష్య ఛేదనలో లంక ఆరంభంలోనే వికెట్ పారేసుకుంది. ఓపెనర్ కుశాల్ (5) పెరీరా ఆర్యన్ దత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెప్టెన్ కుశాల్ మెండీస్ (11) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ నిస్సంకా (54 పరుగులు) నిలకడగా ఆడాడు. మరోవైపు సదీర సమరవిక్రమ, చరిత్ అసలంకతో కలిసి 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి లంక విజయానికి బాటలు వేశారు. 32.4 ఓవర్ వద్ద అసలంక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధనంజయ (30) ఆకట్టుకున్నాడు. ఆఖర్లో అతడు పెవిలియన్ చేరినా.. మిగతా పనిని సమరవిక్రమ పూర్తి చేశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయింది. శ్రీలంక బౌలర్లు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేస్తూ.. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. 21.2 ఓవర్లకు 91 పరుగులు చేసిన నెదర్లాండ్స్.. 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో నెదర్లాండ్స్ 150 పరుగులు చేయడమే గొప్ప అని అనుకున్నారంతా.