Shreyas Iyer Comeback :టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. త్వరలో బ్లూ జెర్సీలో మైదానంలో కనిపించనున్నాడు. ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌నకు శ్రేయస్ అందుబాటులో ఉండనున్నాడు. ఈ ఏడాది మార్చ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో శ్రేయస్ గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శ్రేయస్.. డొమెస్టిక్, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాగా ఇటీవలె గాయం నుంచి కోలుకున్న శ్రేయస్.. బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో తాజాగా పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అయితే తాను ఫిట్‌నెస్‌లో మెరుగుపడేందుకు సహాయపడిన ఎన్సీఏ సిబ్బందికి శ్రేయస్.. కృతజ్ఞతలు తెలిపాడు.
తనకు ఎంతగానో సహాయం చేసిన ఎన్సీఏ బృందంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు."ఈరోజు నేను ఇలా ఉండేందుకు కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు. నేను కోలుకోవడానికి నిరంతరం సహాయం చేసిన నితిన్ భాయ్, రజనీ సర్ అలాగే మొత్తం ఎన్సీఏలోని అందరికీ ధన్యవాదాలు" అంటూ శ్రేయస్ ఆ ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు.
ఇక శ్రేయస్‌తో పాటు మరో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా గాయం నుంచి కోలుకొని.. ఆసియా కప్‌నకు ఎంపికయ్యాడు. ఇక వీరిద్దరూ మిడిలార్డర్లో రాణిస్తే.. టీమ్ఇండియాకు తిరుగు ఉండదనేది క్రీడాభిమానుల అభిప్రాయం. భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌తోనే ఈ మినీ టోర్నీని ప్రారంభించనుంది. కాాగా శ్రేయస్ ట్వీట్‌ను టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. రీట్వీట్ చేశాడు. "భాగ్ భాగ్ భాగ్ ఆయా షేర్ ఆయా షేర్" (సింహం పరిగెత్తుతూ వచ్చింది) అని సూర్య రాసుకొచ్చాడు.