భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఈ ఘటన ఆటలో భాగం కాకపోయినా.. మైదానంలో చోటుచేసుకున్నదే. అసలేం జరిగిందంటే..
తుది జట్టులో లేకపోయినా.. గ్రౌండ్లో సంజూ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా - సంజూ శాంసన్ గ్రౌండ్ స్టాఫ్
టీమ్ఇండియా బ్యాటర్ సంజూ శాంసన్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో రాజస్థాన్ రాయల్స్ జట్టు ట్వీట్ చేసింది. అసలేమైందంటే?
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో సంజూకు చోటు దక్కలేదు. అతడి స్థానంలో దీపక్ హూడా జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ మధ్యలో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. ఈ సమయంలో మైదానంలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తీవ్రమైన గాలుల కారణంగా కవర్లు కప్పేందుకు ఇబ్బంది పడ్డారు. వెంటనే మైదానంలోకి వచ్చిన సంజూ వారికి సహాయం చేశాడు. దీనికి సంబందించిన వీడియోను రాజస్థాన్ జట్టు ట్వీట్ చేయగా వైరల్‌గా మారింది. తుది జట్టులోకి తీసుకోకపోయినా.. నీ సహాయంతో అందరి మనసులను గెలుచుకున్నావంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక మొదటి వన్డేలో ఆడిన సంజూని రెండో మ్యాచ్‌లో పక్కనపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే తొలి వన్డేలో ఓటమితో వెనకబడ్డ టీమ్‌ఇండియా.. ఈ సిరీస్‌ను సమం చేయాలంటే మూడో వన్డేలో తప్పక గెలవాలి.