తొలిసారి నిర్వహించిన అండర్ - 19 మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి టైటిల్‌ను ముద్దాడిన టీమ్ఇండియా. దీంతో యువ ప్లేయర్లను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బందికి రూ. 5 కోట్ల భారీ నజరానాను బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో భారత క్రీడాకారిణులను ప్రత్యేకంగా సత్కరించేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది.
సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్‌కప్ విజేతలకు సన్మానం
అండర్ - 19 మహిళల ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన టీమ్ఇండియా అమ్మాయిలను సత్కరించేందుకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం నిర్వహించనుంది. ఈ వేడుకకు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ చీఫ్ గెస్ట్‌గా రానున్నారు.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. మ్యాచ్‌కు ముందు అండర్ - 19 మహిళల ప్రపంచకప్ విజేతలను సత్కరిస్తామని బీసీసీఐ వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ చేతుల మీదగా వారిని సత్కరించనుంది. కాగా, నేడు దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి భారత మహిళల అండర్ -19 జట్టు చేరుకొంటుంది. "అండర్ -19 మహిళల ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్ జట్టు సభ్యులకు సచిన్ తెందూల్కర్, బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 1 సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది" అని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విటర్ వేదికగా ప్రకటించారు.