Sachin Tendulkar breaks Sunil Gavaskars Record: డిసెంబర్ 10.. టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్తో పాటు అతడి అభిమానులు మర్చిపోలేని రోజు. 2005లో సరిగ్గా ఇదే రోజున టెస్టు క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు లిటిల్ మాస్టర్. భారత దిగ్గజం సునీల్ గావస్కర్ పేరిటి ఉన్న ఓ రికార్డును తిరగరాశాడు. ఆ రికార్డు మళ్లీ ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా అందుకోలేకపోయాడు. అదే టెస్టుల్లో అత్యధిక సెంచరీల రికార్డు.
లంకపై సెంచరీతో..
1986లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్లో తన కెరీర్లో చివరిదైన 34 సెంచరీని నమోదు చేశాడు సునీల్ గావస్కర్. తర్వాతి ఏడాది ఇతడు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటివరకు టెస్టుల్లో అత్యధిక సెంచరీల రికార్డు గావస్కర్దే. ఈ రికార్డును 2005లో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా తిరగరాశాడు లిటిల్ మాస్టర్ సచిన్. 19 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు సృష్టించి నేటికి (డిసెంబర్ 10, 2021) సరిగ్గా 16 ఏళ్లు.
సచిన్ తన 35వ సెంచరీ చేశాక మరో 8 ఏళ్లు క్రికెట్ ఆడాడు. ఈ సమయంలోనే టెస్టుల్లో మరో 16 సెంచరీలు నమోదు చేశాడు. మొత్తంగా తన టెస్టు కెరీర్లో 200 టెస్టులాడిన మాస్టర్.. 51 సెంచరీలు చేసి 15,921 పరుగులు సాధించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు చెక్కుచెదరకపోవడం విశేషం.