Rohith sharma about Teamindia Bench టీమ్ఇండియాకు బలమైన రిజర్వ్ బెంచ్‌ను ఏర్పాటు చేయడం తమ ప్రధాన లక్ష్యమని భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ అన్నాడు. ఎందుకంటే.. బుమ్రా, షమీలాంటి సీనియర్ ఆటగాళ్లు ఎప్పటికీ జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చు కదా అని అభిప్రాయపడ్డాడు. అందుకే బెంచ్‌ను పటిష్ఠం చేసేందుకు ఉన్న మార్గాలపై జట్టు మేనేజ్‌మెంట్ దృష్టిపెట్టిందని వివరించాడు.
"బుమ్రా, షమీ లాంటి ఆటగాళ్లు ఎప్పటికీ టీమ్‌ఇండియాతోనే ఉండిపోరు. అందువల్ల, ఇతర ఆటగాళ్లను కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. బెంచ్‌ను ఎలా పటిష్ఠం చేయాలన్న దానిపై నేను, రాహుల్ భాయ్(రాహుల్ ద్రవిడ్) చర్చలు జరుపుతున్నాం. ఎక్కువ మ్యాచ్‌లు, ఆటగాళ్లకు గాయాల వంటివి ఎదురైనప్పుడు బెంచ్ బలంగా ఉంటే ఎంతో దోహదపడుతుంది. కేవలం ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లపై ఆధారపడే జట్టుగా మేం ఉండకూడదని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరి సహకారంతో సమష్టిగా గెలవాలనుకుంటున్నాం. అందుకే, యువ ఆటగాళ్లకు సాధ్యమైనంత ఎక్కువ అవకాశాలు కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. సీనియర్లతో కలిపి ఆడిస్తే వారూ నేర్చుకుంటారు. జింబాబ్వే సిరీస్‌లోనూ చాలా మందికి తొలిసారి అవకాశం వచ్చింది. వారు ఆ అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకొని రాణిస్తారని విశ్వాసంగా ఉన్నా" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.