ఇప్పటికే పసికూన బంగ్లాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న భారత్‌కు మరో కష్టం వచ్చింది. బొటన వేలి గాయంతో రోహిత్ శర్మ భారత్‌కు వస్తుండడంతో మూడో వన్డేకు దూరం కానున్నాడు. మరోవైపు పేసర్ దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ సైతం గాయాలతో మూడో వన్డే నుంచి తప్పుకున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చికిత్స కోసం తిరిగి భారత్‌కు రానున్నాడు. బొటన వేలు చికిత్సకు సంబంధించి ముంబయిలోని స్పెషలిస్టు డాక్టర్‌ను కలవనున్నట్లు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. దీంతో మూడో వన్డేకు రోహిత్ దూరం కానున్నాడు. అయితే గాయం తీవ్ర కారణంగా ముంబయికి వెళుతుండడంతో తదుపరి బంగ్లాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సైతం అందుబాటులో ఉంటాడో లేదో అనుమానంగా ఉంది.
"రోహిత్ తన గాయానికి సంబంధించి చికిత్స కోసం ప్రత్యేక నిపుణుడిని కలిసేందుకు ముంబయికి వెళుతుండడంతో తన తదుపరి మ్యాచ్‌లో పాల్గొనడు. అయితే గాయం తీవ్రత దృష్ట్యా తర్వాత జరిగే టెస్టు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాల గురించి కచ్చితంగా చెప్పలేను" అని జట్టు హెడ్ కోచ్ ద్రవిడ్ చెప్పారు. దీంతో రోహిత్ టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. అయితే గాయం తీవ్రత అంతగా లేకుండా ఉండి ఫిట్‌నెస్‌గా ఉంటే రోహిత్ బంగ్లాకు వెళ్లే అవకాశం ఉంది.
ఇకపోతే బంగ్లాతో రెండో వన్డేలో సైతం భారత్ ఓడిపోయింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే బంగ్లా జట్టు 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. జట్టు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో తొమ్మిదో నంబర్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన రోహిత్ అజేయంగా 28 బంతుల్లో 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన వీర విహారంతో గెలిపించినంత పనిచేసినప్పటికీ చివరి మెట్టుపై భారత జట్టు బోల్తా పడింది. చివరి బంతికి ఆరు పరుగులు అవసరమైన సమయంలో రోహిత్ షాట్ విఫలం కావడంతో భారత్ 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది.