Rohit Sharma World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబయి వేదికగా శ్రీలంకతో తలపడేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. వరుసగా ఆరు విజయాలను నమోదు చేసిన రోహిత్ సేన ఇప్పుడు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ రోహిత్ తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు నాయకత్వ బాధ్యతలతో భారత జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన కెప్టెన్సీ స్టైల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రోహిత్.
"పరిస్థితులును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలను తీసుకుంటాను. ప్రతి చిన్న విషయంపైనా విశ్లేషణ చేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అవి మంచి ఫలితాలు చూపవచ్చు. లేదా మరికొన్నిసార్లు ప్రయోజనం లేకపోవచ్చు. కానీ, మన దగ్గర నుంచి ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. ప్రతి మ్యాచ్‌కు తగినంత సన్నద్ధత అవసరం. మైదానంలో తీసుకునే నిర్ణయాలు విజయం కోసం మాత్రమే అని నేను నమ్ముతాను. ప్రత్యర్థి జట్ల బలాలు ఏంటి? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారేం చేస్తారు? అనే దిశగానూ నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఇదే విషయన్ని బౌలర్లకూ చెబుతుంటాను. ఇప్పటి వరకు సమష్టిగా మేము చేసింది ఇదే. వికెట్ల కోసం వెళ్లడం లేదా బ్యాటర్లను పరుగులు చేయకుండా అడ్డుకొనేందుకు ఫీల్డింగ్‌లో చురుగ్గా మార్పులు చేయడం కీలకమని నేను భావిస్తున్నాను. చిన్నపాటి మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాల వల్ల గేమ్‌లో మనం ఆధిక్యత ప్రదర్శించేందుకు అవకాశాలు కూడా లభిస్తాయి. దానికి తగ్గట్టు వ్యూహ రచనలో సహచర ఆటగాళ్లు కూడా భాగస్వాములు కావడం చాలా ముఖ్యం. ఇది ఏ మాత్రం తేలికైన విషయం కాదు. వారు పాటించకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి అర్థం ఉండదు. జట్టు విజయాల్లో నాతో పాటు మిగతా పది మందికీ ఈ క్రెడిట్‌ను ఇవ్వాలి. జట్టు నిర్ణయాలకు కట్టుబడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లేది కూడా వారే. ఇది కేవలం కెప్టెన్‌గా నా ఒక్కడి ఆలోచన అయితే కాదు. ఇప్పుడున్న పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి అంతా ఓకే. ప్రతి మ్యాచ్ ఫలితంపై నాకు అవగాహన ఉంది. వరుసగా విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది కనిపించదు. అయితే, ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా బ్యాడ్ కెప్టెన్‌గా కనిపిస్తాను. ఇప్పటికైతే జట్టు విజయం కోసం ఏం అవసరమనే దానిపైనే దృష్టిసారించాను" అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
జట్టు కోసం నిస్వార్థంగా బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్లు కీలక సూచనలు చేశారని.. అతడ్ని కాస్త స్వార్థపూరితంగా బ్యాటింగ్ చేయాలని చెప్పినట్లు విలేకర్లు భారత సారథి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కాసేపు వేచి చూసిన రోహిత్.. ఆ తర్వాత టీమ్ మేనేజర్ వైపు చూడటంతో హాలంతా నవ్వులు విరిశాయి.