Rohit Sharma Injury WTC Final : బుధవారం డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్) ఫైనల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్ఇండియాకు పెద్ద షాక్ తగిలింది! ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం అయిందని తెలుస్తోంది. రోహిత్ చేతి వేలికి గాయం అయినట్లు సమాచారం. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ చేతి వేలికి బ్యాండేజ్ వేసుకున్న ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే రోహత్‌కు టీమ్ఇండియా ఫిజియోలు వైద్య సహాయం అందిచారని.. చేతికి బ్యాండేజ్ వేసుకున్న తర్వాత రోహిత్ తిరిగి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నట్లు సమాచారం. దీన్ని బట్టి గాయం అంత తీవ్రమైనదేమీ కాదని అర్ధమవుతోంది. అయితే రోహిత్ గాయం తీవ్రత, తదితర అంశాలపై ఇంకా ఎవరూ స్పందించలేదు.
ఇకపోతే సోమవారం ప్రాక్టీస్ సమయంలోనూ యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా స్వల్పంగా గాయపడ్డాడని సమాచారం. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు ప్లేయర్లకు వరుసగా గాయాల అవుతుండటం వల్ల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం నుంచి ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో టీమ్ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అతడు రాణించి భారత్‌కు కప్పు తేవాలని ఆశిస్తున్నారు. గణాంకాల పరంగా చూసుకున్నా.. ఇంగ్లాండ్‌లో రోహిత్‌కు మంచి రికార్డు ఉంది. అక్కడ 5 టెస్టులు ఆడిన రోహిత్ 402 పరుగులు చేశాడు. ఇక 2021లో ఓవల్‌లో అతడు సెంచరీ (127) చేయడం విశేషం. ఇప్పటికే ఆస్ట్రేలియా, టీమ్ఇండియా తమ జట్లను ప్రకటించాయి.