తెలంగాణ

telangana

By

Published : Jun 1, 2021, 8:23 PM IST

ETV Bharat / sports

'రోహిత్​ తొలి 50.. నా బ్యాట్​తోనే'

రోహిత్​ శర్మ తొలి హాఫ్ సెంచరీని.. తన బ్యాట్​తోనే సాధించాడని పేర్కొన్నాడు టీమ్ఇండియా వికెట్​ కీపర్ దినేష్ కార్తీక్. అయితే ఈ ఘనత బ్యాట్​ది మాత్రం కాదని ఆడిన బ్యాట్స్​మన్​కే దక్కుతుందని స్పష్టం చేశాడు.

Rohit Sharma, Dinesh Karthik
రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ తన బ్యాటుతోనే తొలి అర్ధశతకం సాధించాడని వెటరన్‌ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో తాను డకౌటైనా నేపథ్యంలో బ్యాటును తిట్టుకున్నానని తెలిపాడు. అప్పుడు రోహిత్‌ ఆ బ్యాటును అడిగి తీసుకొని మరీ అర్ధశతకం బాదేశాడని గుర్తు చేసుకున్నాడు.

డర్బన్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్​లో దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా తలపడింది. షాన్‌ పొలాక్‌ వేసిన ఐదో ఓవర్లో దినేష్ కార్తీక్ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. దీంతో డీకే బ్యాటును తిట్టుకున్నాడు. ఆ తర్వాత రోహిత్‌ అదే బ్యాటుతో 40 బంతుల్లోనే అజేయ అర్ధశతకం అందుకున్నాడు. ఏడు బౌండరీలు, రెండు సిక్సర్లు బాదేశాడు. ఎంఎస్‌ ధోనీతో కలిసి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

"రోహిత్‌ తన మొదటి అంతర్జాతీయ అర్ధశతకాన్ని నా బ్యాటుతోనే అందుకున్నాడు. అందుకు నేనెంతో గర్విస్తున్నా. అవును, నేను దాంతోనే బ్యాటింగ్‌ చేశాను. ఈ బ్యాటు నన్ను తిప్పలు పెడుతోందంటూ రోహిత్‌కు చెప్పాను. ఏంటి? ఈ బ్యాటు బాగా లేదంటావా? నాకివ్వు అంటూ హిట్‌ మ్యాన్‌ అన్నాడు. దాంతో నేనతడికి బ్యాటు ఇచ్చాను. అతడు నేరుగా అదే బ్యాటుతో మైదానంలోకి వెళ్లి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ ఘనత నా బ్యాటుది కాదు. ఆడిన బ్యాట్స్‌మన్‌దే. కానీ అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు ఎంతో బాగుంటుంది. ఆ విషయాలు నాకెంతో విలువైనవి" అని డీకే అన్నాడు.

ఇదీ చదవండి:'మహిళా క్రికెట్​కు మీడియా మద్దతు అవసరం'

ABOUT THE AUTHOR

...view details