తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs NZ: 'ద్రవిడ్​, రోహిత్​ అర్థమవ్వాలంటే కాస్త వేచిచూడాలి' - robin uthappa news

టీమ్​ఇండియా టీ20 సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma News) ఆలోచనా విధానం పూర్తి వేరుగా ఉందని అన్నాడు సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ ప్రణాళికలు అర్థం కావాలంటే కాస్తా వేచి చూడాలని చెప్పాడు (Robin Uthappa News).

Rohit Sharma News, Rahul Dravid India Coach
రాహల్ ద్రవిడ్, రోహిత్ శర్మ

By

Published : Nov 21, 2021, 5:34 PM IST

జట్టుకు ఆరో బౌలర్​ అవసరం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma News) భావించకపోవచ్చని అన్నాడు టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa News). టీ20 కొత్త సారథి రోహిత్‌, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ల (Rahul Dravid India Coach) ఆలోచనా విధానాలను అర్థం చేసుకోవాలంటే కాస్త సమయమిచ్చి చూడాలని సీనియర్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప అభిప్రాయపడ్డాడు.

టీమ్​ఇండియా

న్యూజిలాండ్‌తో (IND vs NZ) జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ హిట్‌మ్యాన్‌ ఐదు బౌలర్లనే ఉపయోగించుకున్నాడు. అయినా, జట్టు వరుస విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్‌తో ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌పై మాట్లాడిన ఉతప్ప తన ఆలోచనలు పంచుకున్నాడు.

"కెప్టెన్‌గా రోహిత్‌ ఆరో బౌలర్‌ అవకాశాన్ని విశ్వసించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో ఐదుగురు బౌలర్లతోనే రాణించడం నాకు సంతోషంగా ఉంది. మనం రోహిత్‌, రాహుల్‌కు (Rahul Dravid Coach) కాస్త సమయం ఇచ్చి చూడాలి. వాళ్ల ప్రణాళికలు ఏంటో అర్థం చేసుకోవాలంటే వేచి చూడక తప్పదు. మూడో టీ20లో వెంకటేశ్‌ అయ్యర్‌ బౌలింగ్‌ చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ.. మనం అతడికి ఎందుకు బౌలింగ్‌ ఇవ్వట్లేదని అడిగేముందు కెప్టెన్‌కు కచ్చితంగా సమయం ఇవ్వాలి"

-రాబిన్ ఉతప్ప, సీనియర్ క్రికెటర్

మరోవైపు రోహిత్‌ (Rohit Sharma News) ఆలోచనా విధానం పూర్తి వేరుగా ఉందని, ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు సరైన ప్రదర్శన చేయలేక ఓడిపోవడం వల్ల మనమంతా ఆరో బౌలర్‌ గురించి ఆలోచిస్తున్నామని అతడు వివరించాడు. అదే సమయంలో రోహిత్‌ ఐదుగురు బౌలర్లతోనే మంచి ప్రదర్శన చేయొచ్చనే నమ్మకంతో ఉండొచ్చన్నాడు.

క్లీన్​స్వీప్​ చేస్తుందా?

ఇక న్యూజిలాండ్​తో (IND vs NZ) మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో నేడు (ఆదివారం) ఆఖరి మ్యాచ్​ జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్​ల్లో విజయం సాధించిన టీమ్​ఇండియా.. కివీస్​ను క్లీన్​స్వీప్ చేయాలని భావిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో తమను ఓడించడమే కాకుండా ఫైనల్‌ కూడా చేరిన కివీస్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలతో సిరీస్‌ సాధించడం కచ్చితంగా భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ ప్రయోగాలు చేయడానికి ఈ మ్యాచ్‌ వేదిక కావచ్చు.

వాళ్లిద్దరికీ ఛాన్స్‌?

తొలి రెండు టీ20లో కొత్త ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్‌, హర్షల్‌ పటేల్‌లకు అవకాశం కల్పించిన జట్టు యాజమాన్యం.. చివరి మ్యాచ్‌లో ఒకరిద్దరికి తుది జట్టులో చోటిచ్చే అవకాశముంది. రుతురాజ్‌ గైక్వాడ్‌, అవేశ్ ఖాన్‌ మైదానంలో దిగడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రుతురాజ్‌.. ధావన్‌ నేతృత్వంలో శ్రీలంకలో పర్యటించిన ద్వితీయ శ్రేణి జట్టులో సభ్యుడు. అప్పుడు రెండు టీ20లు ఆడిన రుతురాజ్‌.. మరో అవకాశం కోసం చూస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో చెన్నై ఓపెనర్‌గా గొప్పగా రాణించిన ఈ మహారాష్ట్ర బ్యాట్స్‌మన్‌ టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇదే లీగ్‌లో దిల్లీ తరఫున వరుసగా రెండు సీజన్లలో సత్తా చాటి టీమ్‌ఇండియా తలుపు తట్టిన మధ్యప్రదేశ్‌ పేసర్‌ అవేశ్ ఖాన్‌ కూడా అరంగేట్రం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. వీళ్లిద్దరి కోసం రాహుల్‌తో పాటు భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌ల్లో ఒకరికి విశ్రాంతినివ్వొచ్చు.

మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన అశ్విన్‌, అక్షర్‌ల్లో ఒకరిని తప్పించి చాహల్‌ను ఆడించేందుకు ఆస్కారముంది. తొలి టీ20ని మించి రెండో మ్యాచ్‌లో మరింత పక్కాగా ప్రణాళికలు అమలు చేయడం, కివీస్‌పై అలవోకగా గెలవడం టీమ్‌ఇండియాకు సానుకూలాంశాలు. ముఖ్యంగా రెండో టీ20లో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన కివీస్‌ను బౌలర్లు కట్టడి చేసిన తీరు ప్రశంసనీయం. రోహిత్‌ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించాయీ మ్యాచ్‌లో. బౌలింగ్‌లో భారత్‌కు పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. బ్యాటింగ్‌లో మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌ అందుకోవాల్సి ఉంది. వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా సత్తా చాటుకోవాల్సి ఉంది. అతడికి ఇంకా బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. చివరి టీ20లో అతడి చేతికి రోహిత్‌ బంతి అందించొచ్చు. గత మ్యాచ్‌లో మాదిరే బ్యాటింగ్‌లో కాస్త ముందు పంపే అవకాశముంది.

ఇదీ చూడండి:'అలా ఆడితే బౌలర్లకు, బౌలింగ్​ మెషీన్లకు తేడా ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details