Rinku Singh Team India : వచ్చే ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో సన్నాహాలు చేస్తున్న బీసీసీఐ ఈ మెగా టోర్నీ కోసం యంగ్ ప్లేయర్లను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచకప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లి లాంటి సీనియర్ ప్లేయర్లు పొట్టి ఫార్మాట్‌కు దూరంగానేు ఉంటున్నారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న యంగ్ ప్లేయర్స్ టీ20 జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా సాగుతున్నారు.
ముఖ్యంగా 26 ఏళ్ల రింకు సింగ్ అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్‌తో ఫినిషర్‌గా ఎదుగుతున్నాడు. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ దూసుకెళ్తున్నాడు. అలా ధోని తర్వాత టీమ్ఇండియాకు మరో మేటి ఫినిషర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఫినిషర్‌గా 2024 పొట్టి కప్పులో ఆడే భారత జట్టులోకి ఎంపికయ్యే ప్లేయర్‌గానూ కనిపిస్తున్నాడు. ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌ల్లో 52.50 సగటుతో అతడు 105 పరుగులు సాధించాడు స్ట్రైక్‌రేట్ 175గా ఉంది. అయితే రింకూ స్కోర్ చేసిన పరుగుల కంటే కూడా అవి సాధించిన తీరు, అప్పటి పరిస్థితులు రింకూను అతడ్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
బౌలర్లను హడలెత్తించి కంగరూలను చిత్తు చేసి
కంగారూ జట్టుతో జరిగిన సిరీస్‌లో రింకు తన సత్తా చాటాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగినప్పుడు జట్టుకు భారీ స్కోరును అందించడం, ఛేదనలో తీవ్ర ఒత్తిడిలోనూ భారీ షాట్లతో జట్టును గెలిపించడం ఫినిషర్ బాధ్యత. రింకు సింగ్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో 14 బంతుల్లో అజేయంగా 22 పరుగులతో జట్టును గెలిపించే మైదానం వీడాడు. దీంతో టీ20ల్లో భారత్ తన అత్యధిక ఛేదన (209) రికార్డు నమోదు చేసింది.
మరోవైపు రెండో టీ20లోనూ 9 బంతుల్లోనే అజేయంగా 31 పరుగులు చేసి జట్టు స్కోరును 230 దాటించాడు. ఇక నాలుగో టీ20లో జట్టు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కేవలం 29 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌తో పాటు సిరీస్ నెగ్గడంలో ఇతడి కీలక పాత్ర ఉంది. పవర్ హిట్టింగ్ నైపుణ్యాలు, క్రీజులో బలంగా నిలబడి బంతిని అమాంతం స్టాండ్స్‌లో పడేసే ట్యాలెంట్ అతడి సొంతం. బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా తొలి బంతి నుంచే సిక్సర్లు బాదగల సత్త అతడికి ఉంది. పైగా ఎడమ చేతి వాటం కూడా కావడం మరింతగా కలిసొచ్చే అంశం.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో రింకూను నెట్టింట మార్మోగుతోంది. అయితే అతడు పొట్టి కప్పులో ఆడాలంటే దానికి అనేక సవాళ్లను దాటి ముందుకు సాగాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ఇండియా మరో ఆరు టీ20లను మాత్రమే ఆడనుంది. సౌతాఫ్రికా టూర్ ఆ తర్వాత 2024 ఐపీఎల్‌లోనూ స్థిరంగా పరుగుల వేటలో సాగితే ఇక రింకూకు జట్టులో స్థానం సుస్థిరమయ్యే అవకాశముంది. ధోనీ, యువరాజ్ లాగా మంచి ఫినిషర్‌గా ఎదిగే సామర్థ్యం రింకూకు ఉందని టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్ కిరణ్ మోరె కొనియాడాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్థంగా బ్యాటింగ్ చేయగడంటూ రింకు నిరూపించుకుంటున్నాడు. హార్దిక్ పాండ్య ఉండొచ్చు, రిషబ్ పంత్ జట్టులోకి రావొచ్చు, సూర్యను బ్యాటింగ్ ఆర్డర్లో కింద ఆడించొచ్చు.. కానీ వీళ్లందరూ పోషించాల్సిన పాత్రలు వేరు. ఇక రింకు ఇలాగే దూకుడు కొనసాగిస్తే ఫినిషర్‌గా కచ్చితంగా టీ20 ప్రపంచకప్ ఆడతాడనడంలో సందేహం లేదు.
'రింకూలో ఆ టాలెంట్ గుర్తించింది అతడే' - ధోనీ నుంచే ఆ ట్రిక్ నేర్చుకున్నాడట!
'రింకూ సింగ్-సిక్సర్ కింగ్, ఆటోగ్రాఫ్ ప్లీజ్ భయ్యా!'- ఫ్యాన్ మూమెంట్ అంటే ఇదే కదా!